వీఐపీలకే ‘ఉత్తర’ దర్శనం
సాక్షి, తిరుమల: పర్వదినాల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. అలాంటి ముక్తి వీఐపీలకే లభించేలా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి, అధికారులు వ్యవహరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సామాన్య భక్తుల బస, దర్శన సౌకర్యాలు ఏమాత్రం పట్టించుకోకుండా.. ఉన్నత వర్గాలకే ఎర్రతివాచీ స్వాగతం పలికేందుకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం నిమగ్నమైపోయింది.
ఈ నెల 11వ తేదీ వైకుంఠ ఏకాదశి, 12వ తేదీ ద్వాదశిలో మాత్రమే తిరుమల ఆలయంలోని వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) తెరిచి భక్తులను అనుమతిస్తారు. ఈ పర్వదినాల్లో శ్రీవారిని దర్శించి, వైకుంఠ ద్వారంలో ప్రదక్షిణ చేసేందుకు వీఐపీలు పోటెత్తుతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన సుమారు 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 20 మంది ఎంపీలు, 200 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, మరో 100 దాకా న్యాయవిభాగం నుంచి వైకుం ఠ దర్శనం కోసం లేఖలు అందాయి. వీరేకాక తమ బంధు గణాలు కూడా వేల సంఖ్యలోనే తరలివస్తున్నట్టు లేఖలు అందుతున్నాయి. ఇదిలాఉంటే, ప్రముఖుల కోసం గురువారం 5 వేల గదులను బ్లాక్ చేయగా శుక్రవారం ఈ సంఖ్య ఏడు వేలకు పెరిగే అవకాశం ఉంది. వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు మంచులో బస కష్టాలు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఏర్పాట్లు పూర్తి: జేఈవో శ్రీనివాసరాజు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తరలివచ్చే భక్తులకు బస, శ్రీవారి దర్శన ఏర్పాట్లు పూర్తిచేశామని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. వీఐపీ దర్శనం అర్ధరాత్రి 1.45 గంటల నుంచి ఉదయం 7 వరకు, ఆ తర్వాత సర్వదర్శనం, కాలినడక భక్తులను అనుమతిస్తామన్నారు. కాలిబాట భక్తులకు 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శన టికెట్లు ఇస్తామన్నారు. కాగా, శ్రీవారి దర్శనానికి బుధవారం ఐదు గంటల సమయం పట్టింది.
ధార్మిక పరీక్షల తేదీ మార్పు
తిరుపతి, న్యూస్‌లైన్: టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 31వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల తేదీని ఫిబ్రవరి 2 నుంచి 8వ తేదీకి మార్పు చేసినట్లు టీటీడీ పీఆర్‌వో రవి తెలిపారు