చిన్న సంస్థలకు రాయితీలున్నాయ్.. | Comprises subsidies to small companies .. | Sakshi
Sakshi News home page

చిన్న సంస్థలకు రాయితీలున్నాయ్..

Published Mon, Mar 28 2016 12:14 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM

చిన్న సంస్థలకు రాయితీలున్నాయ్.. - Sakshi

చిన్న సంస్థలకు రాయితీలున్నాయ్..

ఎంఎస్‌ఎంఈలకు పలు ప్రోత్సాహకాలు
పన్నులు, ఖాతాల విషయంలో మినహాయింపులు


మన దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలదే (ఎంఎస్‌ఎంఈ) కీలక పాత్ర. ఎగుమతుల్లో 45 శాతం వాటా వీటిదే. స్థూల దేశీయోత్పత్తిలో 10 శాతం వస్తున్నది వీటి నుంచే. దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా ఉన్న ఎంఎస్‌ఎంఈలు అనేక కోట్ల మందికి ఉపాధినిస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయరంగం తర్వాత రెండో అతిపెద్ద రంగం ఇదే. ఈ రంగానికి కేంద్రం అనేక రాయితీలిస్తోంది. ప్రత్యేక  చట్టాన్ని కూడా తెచ్చింది. ఈ నేపథ్యంలో ఏ సంస్థలను ఎంఎస్‌ఎంఈలుగా పరిగణిస్తారు? పన్నులకు సంబంధించి అవి పాటించాల్సిన పద్ధతులేంటి? వాటికి ఎలాంటి రాయితీలు లభిస్తాయి? ఇవన్నీ చట్టంలో వివరంగా పొందుపర్చారు. వాటి వివరణే ఇది...

 
ఒక సంస్థను సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థగా గుర్తించాలంటే ఏఏ అర్హతలుండాలన్నది ఎంఎస్‌ఎంఈడీ చట్టంలో నిర్వచించారు. తయారీ రంగానికి, సేవా రంగానికి ఈ నిర్వచనాలు వేరువేరుగా ఉన్నాయి. వీటి వివరాలను పట్టికలో ఇవ్వడం జరిగింది. స్టార్టప్‌లు, ఎస్‌ఎస్‌ఐ, ఎస్‌ఎంఈ ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా ఇవన్నీ వీటి పరిధిలోకే వస్తాయి.

 
ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు

గడిచిన ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.4 కోట్లకు మించకుండా ఉంటే, ఈ సంవత్సరం టర్నోవరు నుండి మొదటి రూ.1.5 కోట్ల మీద ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది.నెలవారీ చెల్లింపులు, రిటర్నులు చేయాల్సిన పనిలేదు. మూడు నెలలకు ఒకసారి చెల్లింపులు, రిటర్నులు చేయొచ్చు. దీనివల్ల తయారీ దారులు పాటించాల్సిన నిబంధనలకయ్యే ఖర్చు బాగా తగ్గుతుంది. నగదు ప్రవాహాన్ని మెరుగుపర్చుకోవడానికి అదే సంవత్సరంలో చెల్లించిన ఎక్సైజ్ పన్నును పూర్తి క్రెడిట్‌గా తీసుకోవచ్చు. అదే ఏడాదిలో టర్నోవర్ రూ.90 లక్షలు దాటని సంస్థలు ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకోనవసరం లేదు. అదే సేవా రంగంలో అయితే టర్నోవర్ రూ.9 లక్షలు దాటకపోతే సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ తీసుకోనవసరం లేదు.

 
వ్యాట్‌లో ప్రోత్సాహకాలు
దేశంలో అనేక రాష్ట్రాలు ఎస్‌ఎంఈ రంగాలకు పలు మినహాయింపులు, రాయితీలు అందిస్తున్నాయి.   రూ.10 లక్షలలోపు టర్నోవర్ కలిగిన సంస్థలను చాలా రాష్ట్రాలు వ్యాట్ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ‘కాంపోజిషన్ స్కీము’ను ప్రవేశపెట్టాయి. దీని ప్రకారం ఒక లిమిట్ దాటని ఎస్‌ఎంఈ సంస్థలు వ్యాట్ కట్టేటప్పుడు ‘కన్సిషనల్ రేటు’ను వినియోగించుకోవచ్చు. అంటే వ్యాట్ శాతం కన్నా తక్కువ శాతం పన్ను చెల్లించవచ్చన్నమాట.

 

ఫైనాన్షియల్ బేసిక్స్.. పిల్లలకు ఆరోగ్య బీమా ఎప్పుడు తీసుకోవాలి?
పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియదు. అందుకే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. పిల్లలు కూడా ఈ కోవలోకే వస్తారు. వారికి కూడా ఆరోగ్య బీమా తీసుకోవాలి. వీరికి పుట్టిన 90 రోజుల తర్వాత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఉత్తమం. అప్పుడు వారికి భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైనా, వాటికయ్యే ఆరోగ్య ఖర్చులకు పాలసీ వర్తిస్తుంది. ప్రస్తుతం వివిధ బీమా కంపెనీలు పిల్లల కోసం ప్రత్యేకంగా పలు రకాల హెల్త్ పాలసీలు అందిస్తున్నాయి. వీటిలో మన అవసరాలకు అనువైన పాలసీని ఎంచుకోవాలి. అలాగే ఒక బీమా కంపెనీ ఆరోగ్య బీమా పాలసీలను మరొక బీమా కంపెనీ పాలసీతో పోల్చి చూసుకోండి. సర్వీసులు, ప్రీమియం వంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోండి. పాలసీకి సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా తెలుసుకోండి. అవసరమైతే ఆయా విషయాలపై ఈ రంగంలో నిపుణుల సలహాలను తీసుకోవాలి. తద్వారా ఈ అంశంపై ఒక అవగాహనకు రావడానికి అవకాశం లభిస్తుంది.

 

మొన్నటి బడ్జెట్ సానుకూలం...
ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 44 ఏడీ ప్రకారం చిన్న వర్తకులు చేసే వ్యాపారంపై లాభాన్ని ఊహించుకుని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీరు ఎటువంటి అకౌంటింగ్ బుక్స్ నిర్వహించాల్సిన పనిలేదు. తాజా బడ్జెట్‌లో  ఈ పరిమితిని రెట్టింపు చేశారు. గతంలో కోటి రూపాయల లోపు టర్నోవర్ ఉన్న వారు వాస్తవ లాభాల మార్జిన్‌తో సంబంధం లేకుండా ఆదాయంపై 8% లాభాన్ని చూపించుకునేవారు. ఇప్పుడు ఈ పరిమితిని 2 కోట్లకు పెంచారు. అంటే ఇక నుంచి రెండు కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వారు 8 శాతం లాభాన్ని చూపించి ఆ మేరకు పన్నులు చెల్లిస్తే సరిపోతుంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 33 లక్షల ఎంఎస్‌ఎంఈలు అకౌంటింగ్ బుక్స్, ఆడిటర్ల విషయంలో మినహాయింపు పొందారు.

  
పన్ను మినహాయింపు బ్రాకెట్‌లో ఉంటూ రాయితీలు పొందుతున్న ఎస్‌ఎంఈలు వారి ఉత్పత్తిని పెంచడానికి సంకోచిస్తున్నాయి. టర్నోవర్ రూ. 5 కోట్లు దాటని సంస్థలకు (2015, మార్చి నాటికి) కార్పొరేట్ ఆదాయ పన్నుని 29 శాతానికి తగ్గించింది. అయితే విధిగా సెస్, సర్ చార్జీ కట్టాల్సి ఉంటుంది.  స్టార్టప్‌లకు మొదటి మూడేళ్లు 100 శాతం పన్ను మినహాయింపు ఉంటుందని తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ( ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2019 వరకు ). ఇప్పుడు అన్‌లిస్టెడ్ కంపెనీల విషయంలో (అంటే స్టార్టప్ మరియు ప్రైవేటు సంస్థల విషయంలో)  లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ హోల్డింగ్ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు.

 

కహానీ... గోల్డ్ లైవ్..
మనం బాగా విలువనిచ్చే లోహం బంగారం. దాని ధర ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి పెరుగుతుంది. మరొకసారి తగ్గుతుంది. ఒక్క క్లిక్‌తో ఎప్పటికప్పుడు అంతర్జాతీయంగా స్పాట్‌లో బంగారం ధరను తెలుసుకోవాలంటే మీరు ‘గోల్డ్ లైవ్’ యాప్‌ను ఉపయోగించి చూడండి. ఈ యాప్‌లో అంతర్జాతీయ దిగ్గజ ఇండెక్స్‌లను, క్రూడ్, ఫారెక్స్ వివరాలను తెలుసుకోవచ్చు. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ప్రత్యేకతలు
బంగారం ధర లైవ్‌లో చూడొచ్చు. ప్రతి 10 నిమిషాలకు బంగారం ధర అప్‌డేట్ అవుతూ ఉంటుంది. బంగారం సహా వెండి, ప్లాటినం, కాపర్, నికెల్, అల్యూమినియం, జింక్, లెడ్, యురేనియం వంటి తదితర లోహాల ధరల్ని కూడా తెలుసుకోవచ్చు. ఆయిల్ ధరను కూడా పొందొచ్చు. అంతర్జాతీయ దిగ్గజ ఇండెక్స్‌లు, గోల్డ్  సూచీలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడొచ్చు.  మైనింగ్ స్టాక్స్ ఎలా కదులుతున్నాయో తెలుసుకోవచ్చు. ఆయిల్ ధర, సూచీలు, బంగారం విలువకు సంబంధించి అలర్ట్స్‌ను సెట్ చూసుకోవచ్చు. బంగారం, ఇతర లోహాల విలువను వివిధ కరెన్సీల్లోనూ, పరిమాణాన్ని గ్రాము, కేజీ, ఔన్స్‌లోనూ చూడొచ్చు.   పలు దేశాల కరెన్సీలకు చెందిన ఎక్స్చేంజ్ రేట్లను పోల్చి చూసుకోవచ్చు. బంగారం, ఇతర లోహాలు, క్రూడ్ ధరలకు సంబంధించిన టెక్నికల్ చార్ట్స్‌ను చూడొచ్చు. మార్కెట్ వార్తలను చదవొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement