పార్లమెంట్లో సస్పెన్షన్ ప్రకంపనలు | Cong MPs' suspension good for Lok Sabha proceedings: HT readers | Sakshi
Sakshi News home page

పార్లమెంట్లో సస్పెన్షన్ ప్రకంపనలు

Published Wed, Aug 5 2015 12:27 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

పార్లమెంట్లో సస్పెన్షన్ ప్రకంపనలు - Sakshi

పార్లమెంట్లో సస్పెన్షన్ ప్రకంపనలు

కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఒక్కటైన విపక్షం
గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ధర్నా.. పాల్గొన్న ఎస్పీ, ఆర్జేడీ, ఆప్
ధర్నాలో నల్ల బ్యాడ్జీలతో పాల్గొన్న సోనియా, రాహుల్
సహచర ఎంపీలతో గళం కలిపి నినాదాలు
లోక్‌సభలో కాంగ్రెస్ బాయ్‌కాట్, వాకౌట్‌లతో విపక్షాల సంఘీభావం

 
న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రాంగణం మంగళవారం నినాదాలు, నిరసనలతో హోరెత్తింది. లోక్‌సభ నుంచి కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌ను తీవ్రంగా తీసుకున్న విపక్షం ఐక్యంగా  అధికార పక్షంపై ఎదురుదాడి ప్రారంభించింది. తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలపై స్పీకర్ వేటు వేయడంపై కాంగ్రెస్ పార్లమెంటు లోపల, వెలుపల తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీల నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలంతా పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. సస్పెన్షన్‌కు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి ‘వి వాంట్ జస్టిస్’, ‘నరేంద్ర మోదీ డౌన్ డౌన్’ ‘నియంతా! సిగ్గు, సిగ్గు’ తదితర నినాదాలతో హోరెత్తించారు. సాధారణంగా ధర్నాల్లో మౌనంగా కూర్చునే సోనియా సైతం.. సహచర ఎంపీల నినాదాలకు గళం కలిపారు. పిడికిలెత్తి నినాదాలు చేస్తూ సహ సభ్యుల్లో ఉత్సాహం నింపారు. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ అంశం అనూహ్యంగా విపక్ష పార్టీలను ఏకం చేసింది. కాంగ్రెస్ ధర్నాలో సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్ పార్టీల ఎంపీలు సైతం పాల్గొన్నారు. ఎంపీల సస్పెన్షన్‌పై కోల్‌కతా, జమ్ము, శ్రీనగర్, లక్నో సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

పార్లమెంట్‌లోనూ కాంగ్రెస్‌కు విపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. కాంగ్రెస్(సస్పెన్షన్‌కు గురికాని సభ్యులు), తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, ముస్లింలీగ్, జేడీయూ సభ్యులు లోక్‌సభ కార్యక్రమాలను బహిష్కరించగా, లెఫ్ట్, ఎస్పీ, ఆర్జేడీ సభ్యులు సభ ప్రారంభం అయిన కాసేపటికి వాకౌట్ చేశారు. దాంతో విపక్ష స్థానాలు దాదాపు ఖాళీ అయ్యాయి. మరోవైపు, ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి, ప్లకార్డులతో నిరసన తెలిపారు. తెలంగాణాకు ప్రత్యేక హైకోర్టు కోరుతూ టీఆర్‌ఎస్ సభ్యులు తమ చొక్కాలకు నినాదాలు రాసిన కాగితాలను పిన్ చేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ మధ్యలోనే రైల్వే అప్రొప్రియేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.  రాజ్యసభలో కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సభ ప్రారంభం కాగానే భుజాలకు నల్ల రిబ్బన్లు కట్టుకున్న కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకొచ్చి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. వారిలో ఒకరు నల్లని వస్త్రాన్ని ఊపుతుండటంపై డెప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయిదాల అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది.

పునరాలోచించండి.. 25 మంది కాంగ్రెస్ ఎంపీలకు విధించిన శిక్షను తగ్గించాలని, సభలో విపక్షం లేని పరిస్థితుల్లో ముఖ్యమైన శాసన సంబంధ కార్యకలాపాలను చేపట్టకూడదని లోక్‌సభలో బీజేడీ సభ్యుడు తథాగత్ సత్పథి స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను కోరారు. ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తేందుకు అన్నాడీఎంకే సభ్యుడు వేణుగోపాల్ చేసిన ప్రయత్నాన్ని స్పీకర్ అడ్డుకున్నారు.
 
నీవు  నేర్పిన విద్యయే జైట్లీజీ: అయ్యర్

 జీఎస్టీ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటోందన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విమర్శలను కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ తిప్పికొట్టారు. యూపీఏ హయాం నాటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లు సభ ఆమోదం పొందకుండా అడ్డుకుంది జైట్లీ నాయకత్వంలోని బీజేపీనేనని గుర్తు చేశారు. అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ తీవ్రంగా వ్యతిరేకించినందువల్లనే బీజేపీ ఆ వైఖరి తీసుకుందని విమర్శించారు. ‘బిల్లులను అడ్డుకోవడం ఎలానో మాకు నేర్పిన జైట్లీనే ఇప్పుడు మేం వాటినే పాటిస్తోంటే విమర్శిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు.
 
ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే: సోనియా

తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలను 5 రోజుల పాటు సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, ఆనంద్ శర్మ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో కలసి ఆమె నినాదాలు చేశారు. పార్లమెంటు నుంచి గెంటేసినా, సభలో అడుగుపెట్టనివ్వకపోయినా.. కళంకిత బీజేపీ నేతలు రాజీనామా చేసేంతవరకు తమ పోరాటం ఆగదని రాహుల్  స్పష్టం చేశారు. ‘వ్యాపమ్ స్కామ్ వేలాది మంది భవిష్యత్తును నాశనం చేసింది. మోదీగేట్‌లో సుష్మ  చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. రాజస్తాన్ సీఎంకు లలిత్ మోదీతో  ఆర్థికపరమైన సంబంధాలున్నాయి. వారిపై చర్యలు తీసుకునే విషయంలో మోదీ ఎందుకు మౌనం పాటిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ప్రధాని.. దేశ ప్రజల మాట వినేందుకు ఎందుకు ముందుకు రావడంలేదు? బీజేపీ కళంకిత నేతల రాజీనామా మా డిమాండ్ కాదు.. దేశ ప్రజల డిమాండ్’ అన్నారు. ఎంపీలను సస్పెండ్ చేయడం సమస్యను పరిష్కరించే మార్గం కాదని మన్మోహన్ అన్నారు.  స్పీకర్  నిర్ణయం సరికాదని, ఆమె పునరాలోచించాలని ఎస్పీ అధినేత ములాయం  సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement