న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్‌సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే డీఎంకే, ఎన్సీపీ, సీపీఎం తదితర పార్టీల ఎంపీలు తమ స్థానాల్లో నిల్చున్నారు. కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తాము లేవనెత్తిన అంశాలపై చర్చ ప్రారంభించాలన్నారు.
ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్ దాదాపు అరగంటపాటు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. సభలో అలజడి తగ్గే పరిస్థితి లేకపోవడంతో 11.30 గంటలకు స్పీకర్ బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మే 21, జూన్ 30వ తేదీన తీసుకొచ్చిన పన్నుల విధానంలో మార్పులకు సంబంధించిన రెండు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆర్థిక చట్టం 2002లోని ఎనిమిదో షెడ్యూల్ సవరణకు ఉద్దేశించిన ఈ తీర్మానాలు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి.
సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు నినాదాలు కొనసాగించారు. సభకు అంతరాయం కలిగిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగిస్తుండడంతో స్పీకర్ స్థానంలో ఉన్న కిరీట్ సోలంకీ అసహనం వ్యక్తం చేశారు. ‘మీ స్థానాల్లోకి వెళ్లండి, సభ సజావుగా సాగేందుకు సహకరించండి’ అని పదేపదే కోరినా విపక్ష ఎంపీలు శాంతించలేదు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు కిరీట్ సోలంకీ ప్రకటించారు.
సభ జరుగుతుండగానే సమన్లు జారీ చేస్తారా?: ఖర్గే
దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు. గురువారం వెల్‌లోకి చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విపక్షాల నిరసనల మధ్యే సభాపతి ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. నినాదాలు ఆపేసి, మీ స్థానాల్లోకి వెళ్లండి అంటూ సభాపతి స్థానంలో ఉన్న వి.విజయసాయిరెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి, పోడియం ఎదుట నిల్చోవడం సరైన పద్ధతి కాదన్నారు. అయినప్పటికీ విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు.
ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని, వేధింపులకు గురిచేస్తోందని రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు ఈడీ తనకు సమన్లు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఖర్గే మాట్లాడారు. ఎన్నిరకాలుగా భయపెట్టాలని చూసినా ప్రభుత్వానికి తలవంచబోమని తేల్చిచెప్పారు. చట్టాన్ని గౌరవిస్తానని అన్నారు. తాము ఎవరికీ భయపడబోమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తామని ఉద్ఘాటించారు.
చట్టం నుంచి పారిపోవద్దు: పీయూష్ గోయల్
దర్యాప్తు సంస్థల విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసిందని ఆక్షేపించారు. చట్టం నుంచి పారిపోవద్దని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలు సక్రమంగా కొనసాగేందుకు అందరూ సహకరించాలని అన్నారు.
చట్టసభకే అవమానం: జైరామ్ రమేశ్
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే ఖర్గేకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్విట్టర్‌లో తప్పుబట్టారు. ఈడీ చర్య చట్టసభకే అవమానకరం అని స్పష్టం చేశారు. తమ ఎంపీలు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలుస్తారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
చట్టానికి సోనియా, రాహుల్ అతీతులా?: బీజేపీ
కాంగ్రెస్ నాయకులు ఈడీని ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చట్టానికి అతీతులా? అని నిలదీశారు.
ఖర్గే సమక్షంలో ‘యంగ్ ఇండియన్’లో సోదాలు
ఈడీ సమన్లకు మల్లికార్జున ఖర్గే స్పందించారు. గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు ఢిల్లీలో ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక హోల్డింగ్ కంపెనీ యంగ్‌ఇండియన్(వైఐ) కార్యాలయంలో ఖర్గే సమక్షంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సాక్ష్యాధారాల కోసం సోదాలు జరిపినట్లు అధికారులు చెప్పారు. మల్లికార్జున ఖర్గేను ఈడీ అధికారులు 7 గంటలకుపైగా విచారించారు.
ఏమైనా చేసుకోండి.. మోదీకి భయపడం
ప్రధాని మోదీకి భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తేల్చిచెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ద్వారా తమను బెదిరించలేరని అన్నారు. రాహుల్ గురువారం పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడారు. తమను భయభ్రాంతులకు గురిచేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవి ఎట్టిపరిస్థితుల్లోనూ ఫలించబోవని స్పష్టం చేశారు. ‘వారు(కేంద్రం) ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు.
దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, దేశంలో సామరస్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తూనే ఉంటా. వారు ఏం చేసుకున్నా నా కృషి మాత్రం ఆగదు’’ అని ఉద్ఘాటించారు. తమపై ఒత్తిడి పెంచడం ద్వారా నోరు మూయించాలని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. తాము మౌనంగా ఉండబోమని, దేశంలో నరేంద్ర మోదీ, అమిత్ షా చర్యలకు వ్యతిరేకంగా గొంతెత్తూనే ఉంటామని వెల్లడించారు. వారు ఏం చేసుకుంటారో తమకు సంబంధం లేదన్నారు. చట్టంనుంచి తాము పారిపోవడం లేదని పరోక్షంగా తెలియజేశారు. చట్టం నుంచి తప్పించుకోవడం గురించి బీజేపీ నాయకులే మాట్లాడుతున్నారని చెప్పారు.
సత్యాన్ని దాచలేరు..
ప్రధాని మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘సత్యాన్ని దాచలేరు. సత్యానికి అడ్డుకట్ట వేయలేరు. మీరు(కేంద్రం) ఏదైనా చేసుకోండి. ప్రధానికి భయపడను. దేశ ప్రయోజనాల పరిరక్షణకు పనిచేస్తా’ అంటూ గురువారం ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment