సభలో కాంగ్రెస్ బోర్లా!
- రైతు ఆత్మహత్యలపై సర్కారును నిలదీయడంలో విఫలం
- ‘మాఫీ’పై హామీ లేకుండానే రెండ్రోజులు సభ నడిపించిన టీఆర్‌ఎస్
- జానా తీరుపై పార్టీ సీనియర్ల గుర్రు
- సీఎంను పొగడటం పార్టీకి నష్టమేనని వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అలసత్వం కారణంగానే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటూ శాసనసభ బయట విరుచుకుపడిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. అసెంబ్లీలో అధికార పక్షం వ్యూహం ముందు బోర్లా పడింది. ఈ అంశంపై కచ్చితమైన హామీ, ప్రకటన లేకుండానే రెండ్రోజులపాటు చర్చ సాగేలా చూడటంలో అధికార టీఆర్‌ఎస్ సఫలమైంది.
రైతు సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపలేకపోయిందన్న వాదనను వినిపించడంలో కాంగ్రెస్ సహా అన్ని పక్షాలూ విఫలమయ్యాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసినా.. ఒకేసారి చెల్లించకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయిందన్న వాదన వినిపిస్తోంది.
రెండ్రోజులపాటు చర్చ సాగినా రైతులు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో విఫలమయ్యామని విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం అన్ని పక్షాలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడంలో సరైన పాత్ర పోషించలేకపోయిందని లెఫ్ట్ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చే స్తున్నాయి.
కాంగ్రెస్‌లో అంతర్మథనం
అసెంబ్లీలో పార్టీ పనితీరుపై కాంగ్రెస్ సీనియర్లలో అంతర్మథనం జరుగుతోంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తర్వాత కూడా అసెంబ్లీలో ఇంకా సంయమనం పాటించాలన్న ప్రతిపక్ష నేత జానారెడ్డి తీరు వారికి మింగుడు పడటం లేదు. పెపైచ్చు వీలైనన్నిసార్లు సీఎం కేసీఆర్‌ను జానా పొగడ్తలతో ముంచెత్తడం కూడా పార్టీకి నష్టమేనని వారు భావిస్తున్నారు.
రైతు ఆత్మహత్యలపై సీఎం ప్రసంగం సమయంలో అడ్డుపడాల్సిందని, అయితే ప్రసంగం పూర్తయిన తర్వాత కూడా ప్రేక్షకుల్లా సభలో ఉండిపోవాల్సి వచ్చిందని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. ‘‘నాకు తెలిసి ప్రధాన ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ ఇంత ఘోరంగా ఎప్పుడూ వైఫల్యం చెందలేదు. ప్రతిపక్ష హోదా లేకపోయినా 1994-99లో, బలమైన ప్రతిపక్షంగా 1999-2004 మధ్య కాంగ్రెస్ అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఉరుకులు పెట్టించింది’’ అని మరో సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
రేవంత్ ఎక్కడ?
అసెంబ్లీ బయట కేసీఆర్‌ను తూర్పారపడుతున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రైతు ఆత్మహత్యలపై చర్చ జరిగిన రెండ్రోజుల పాటు సభకే రాలేదు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. మిత్రపక్షమైన బీజేపీ స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని టీడీపీ ఇరకాటంలో పెట్టలేకపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు.