
ప్రధాని నుంచి ప్రతిపాదన వస్తేనే...
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర దించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. సమస్య పరిష్కారానికి ప్రధాని నుంచి ప్రత్యక్ష ప్రతిపాదన వస్తే అఖిలపక్ష సమావేశానికి వస్తామని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ తెలిపారు. వార్తల్లో నిలవవాలన్న ఆకాంక్ష తమకు లేదన్నారు. తమ డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
లలిత్ గేట్, వ్యాపం కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మ స్వరాజ్, వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. కాగా, పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.