
వాటర్‌గ్రిడ్ అవసరం లేదు..
రైతు మహాధర్నాలో భట్టి విక్రమార్క
నిజామాబాద్ సిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్ గ్రిడ్ పథకం అవసరం లేదని, ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తే చాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కిసాన్ కేత్ మజ్దూర్ ఆధ్వర్యంలో బుధవారం రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఆయన రైతులనుద్దేశించి మాట్లాడారు.
తెలంగాణలోని ఆరు జిల్లాలో సాగు, తాగునీటి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిందన్నారు. సీఎం కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్.. పైపుల కంపెనీల వారితో లాలూచీపడి డిజైన్ మార్చారని ధ్వజమెత్తారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం డిజైన్ మార్చితే.. పథకం పనులను కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు.
తుమ్మిడిహెట్టి వద్దకు వెళ్లి అక్కడి నుంచి ప్రాణహిత డిజైన్ మార్పు, అందులోని అవకతవకలపై రాష్ట్ర ప్రజలకు వివరిస్తామన్నారు. ఇప్పటికే ప్రాణహిత పనులకు రూ.10 వేల కోట్లు ఖర్చయిందని, ఈ పనుల కోసం పెట్టిన ఖర్చులు ఏం కావాలని ప్రశ్నించారు. తెలంగాణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు ఇప్పుడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రుణమాఫీ ఎక్కడ? : కోదండరెడ్డి
ఎన్నికలకు ముందు, తర్వాత చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర కిసాన్ కేత్ మజ్దూర్ అధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు.