కాంగ్రెస్ పార్టీకి కొద్దిపాటి ఊరట లభించింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన బలం దక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన బలం దక్కింది. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు ప్రధాన రాష్ట్రాలను కోల్పోయినా.. సర్వేలు ముందు నుంచి చెబుతున్నట్లే మిజోరంలో మాత్రం అధికారం 'హస్త'గతమయ్యింది. ఆ రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 21 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ బలం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సొంతమైంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో విజయం సాధించి, మరో నాలుగు చోట్ల కూడా ఆధిక్యంలో నిలిచింది.
మరోవైపు మిజో నేషనల్ ఫ్రంట్ మూడు స్థానాల్లోనే గెలిచి, మరోచోట ఆధిక్యం కనబరుస్తోంది. ఇంకా 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన వివరాలు రావాల్సి ఉంది. వీటిలోనూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో కొన్ని దక్కుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మేజిక్ మార్కు 21ని దాటేసిన కాంగ్రెస్ పార్టీ.. ఎట్టకేలకు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కచోట మాత్రం అధికారాన్ని దక్కించుకున్నట్లు అయ్యింది.