మోదీకి బుద్ధి చెబుతా: రాహుల్
మోదీకి బుద్ధి చెబుతా: రాహుల్
Published Sat, Dec 24 2016 2:40 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
ధర్మశాల: అధిక విలువ నోట్ల రద్దు వల్ల పేదలు, రైతులు, మధ్య తరగతి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. మధ్యప్రదేశ్, జార్ఖాండ్, చత్తీస్ ఘడ్ లలో బీజేపీ ప్రభుత్వం కేవలం ఆదివాసి భూములను మాత్రమే లాక్కుందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని రెండు ముక్కలు చేశారని అన్నారు. ఓ భాగంలో కేవలం ఒక శాతం ఉన్న ధనవంతులకు ఇచ్చేసి మరో భాగంలో మధ్యతరగతి, పేదలు ఉండేలా చేశారని వ్యాఖ్యానించారు.
నోట్లకు రంగులేదన్న రాహుల్.. అవినీతిపరుల చేతిలోకి వెళ్లిన తర్వాతే అది నల్లడబ్బుగా మారుతోందని చెప్పారు. భారత్ లో కేవలం ఆరు శాతం మాత్రమే నల్ల డబ్బు ఉందని మిగిలినదంతా రియల్ ఎస్టేట్, బంగారం రూపంలో ఉందని పేర్కొన్నారు. నల్లడబ్బు కేవలం బ్యాంకు అకౌంట్లలో కాకుండా బంగారం, రియల్ ఎస్టేట్ రూపంలోకి మారుతోందని అన్నారు. స్విస్ బ్యాంకులో నల్లడబ్బును దాచుకున్న అవినీతి పరుల జాబితా మోదీ పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు.
ఢిల్లీలో లైన్లలో నిల్చున్న పేదలకు బీజేపీ మూడు రూపాయల లడ్డు ఇచ్చిందని, అదే విజయ్ మాల్యాకు రూ.1,200 కోట్లు ఎగ్గొట్టి విదేశాలు చెక్కేస్తే చూస్తూ ఊరుకుందని విమర్శించారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు భారత నగదు వ్యవస్ధకు కార్చిచ్చు పెట్టిందని అన్నారు. మోదీ సిమ్లా, ధర్మశాల ప్రజల నడ్డి విరిచారని ఉద్రేకంగా మాట్లాడారు. మోదీ తనతో పరాచకాలు ఆడుతున్నారని ఆయనకు త్వరలోనే బుద్ధి చెబుతానని అన్నారు.
Advertisement
Advertisement