విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ బలహీనం: బొత్స సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందనడంలో సందేహమే లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. తప్పును పార్టీ సరిదిద్దుకునేలా ఒత్తిడి చేస్తామే తప్ప కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సమన్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ కోరుతున్న నేపథ్యంలో మళ్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సీమాంధ్రలో ప్రజల ఇబ్బందుల దృష్ట్యా తక్షణమే సమ్మెను విరమించాలని ఉద్యోగులను, ఏపీఎన్జీవో నాయకులను కోరారు. లేదంటే ఉద్యమం ముసుగులో అసాంఘిక శక్తులు చొరబడి ప్రభుత్వ, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే ప్రమాదం ఉందన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడుతూ, ‘‘మళ్లీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నా. సమన్యాయం అంటే ఏమిటి? అనే దానిపై వాటి వివరణ తీసుకోవాలి. సీమాంధ్రలో ఆందోళనలు, ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలి’’ అని కోరారు. విజయనగరంలో తన ఆస్తులపై దాడి చాలా చిన్న విషయమని అన్నారు. శాంతిభద్రతలకు సంబంధించి పోలీసులదే పూర్తి బాధ్యతని చెప్పారు.
తెలంగాణ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తాను, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గతంలో చెప్పిన మాట వాస్తవమేనన్నారు. ‘‘పెద్దల వద్దకు వెళ్లినప్పుడు మా అభిప్రాయాలివిగో అని చెబుతాం. ఆ తరువాత వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని సంప్రదాయం మేరకు అంటామే తప్ప దానికే కట్టుబడి ఉండాల్సిన పనిలేదు. హిందీ మాట్లాడే వాళ్లకు చాలా రాష్ట్రాలున్నప్పుడు తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటని అన్న మాట వాస్తవమే. ఇద్దరు కొడుకుల్లో ఒకరు విడిపోతానని చెప్పినప్పుడు తండ్రి అందుకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అతను పడే బాధను, అందరూ కలిసి ఉంటేనే బాగుంటుందనే తపనను కూడా అర్థం చేసుకోవాలి కదా!’’ అని వివరించారు. తనను సీఎంగా నియమించబోతున్నారన్న ప్రచారం వెనుక కుట్ర ఉందన్నారు. ఈరోజు కూడా తన తల్లికి ఏదో జరిగిందంటూ సంక్షిప్త సందేశాలు పంపుతున్నారని వాపోయారు. సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.