న్యూఢిల్లీ : సొంత పార్టీ ఎంపీలే తిరుగుబాటు బావుట ఎగురవేయటంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతోయూపీఏ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎంపీలు ఆరుగురు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్సభ స్పీకర్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ నిన్న ఉదయం స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం తీర్మానంపై స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆరుగురు ఎంపీలు ఈరోజు ఉదయం పదిగంటలకు మరోసారి భేటీ కానున్నారు.
మరోవైపు ఎంపీలను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ ...ఎంపీలతో మంతనాలు జరుపుతున్నారు. అయితే.. సీమాంధ్ర ప్రాంతం నుంచి కాంగ్రెస్‌కు మొత్తం 19 మంది లోక్‌సభ సభ్యులు ఉండగా.. వారిలో ఆరుగురు మాత్రమే అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేయటం విశేషం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎంపీలు కూడా విడి విడిగా స్పీకర్కు నోటీసులు ఇచ్చాయి.
కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉంటేనే చర్చ...
ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలతో సహా మూడు పార్టీల తరఫున మొత్తం 13 మంది ఎంపీలు అవిశ్వాసం నోటీసులు ఇచ్చినట్లయింది. ప్రస్తుతం ఈ నోటీసులు స్పీకర్ మీరాకుమార్ పరిశీలనలో ఉన్నాయి. సభ సజావుగా జరిగిన పక్షంలో స్పీకర్ మొదటి ప్రాధాన్యతా అంశంగా తీసుకుని అవిశ్వాస తీర్మానం నోటీసులను సభలో చదివి సభ అభిప్రాయాన్ని కోరతారు.
స్పీకర్ ఇలా కోరినపుడు కనీసం యాభై మంది సభ్యులు నిలబడి నోటీసుకు మద్దతు తెలిపితే అప్పుడు స్పీకర్ అవి శ్వాస తీర్మానాన్ని సభలో పెట్టడానికి అనుమతి మంజూరు చేస్తారు. ఆ తర్వాత అన్ని పక్షాలతో చర్చించి.. అవిశ్వాస తీర్మానం ఏ రోజున పెట్టాలి? దానిపై చర్చకు ఎంత సమయం కేటాయించాలి? ఎప్పుడు ఓటింగ్ జరపాలి? అనే అంశాలను స్పీకర్ నిర్ణయిస్తారు.