బాంబు పెట్టి.. కానిస్టేబుల్‌ను చంపిన హెడ్
మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో ఘోరం జరిగింది. మోటార్ సైకిల్లో బాంబు పెట్టి.. సహ కానిస్టేబుల్‌ను చంపేశాడో హెడ్ కానిస్టేబుల్. ఓ లేడీ కానిస్టేబుల్ గురించిన వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నితేష్ పాటిల్ (28) అనే కానిస్టేబుల్ శివర్ధన్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తాడు. అతడికి ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం ఉందన్న కోపంతో ప్రహ్లాద్ పాటిల్ (45) అనే హెడ్ కానిస్టేబుల్ ఇతడి బైకులో బాంబు పెట్టాడు. నితేష్ తన బైకు స్టార్ట్ చేసేందుకు కిక్ కొట్టగానే బాంబు పేలి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కుట్రకు కారణం వివాహేతర సంబంధం వల్ల ఏర్పడిన వ్యక్తిగత ద్వేషమేనని తెలుస్తోందని, నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని రాయగఢ్ ఎస్పీ మహ్మద్ సువేజ్ హక్ తెలిపారు.
రాయగఢ్ రీజియన్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో పనిచేసే మహిళా కానిస్టేబుల్‌తో సంబంధం విషయమై ప్రహ్లాద్, నితేష్‌ల మధ్య చాలాసార్లు గొడవ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. నితేష్‌కు అప్పటికే పెళ్లయింది, రెండున్నర నెలల పాప కూడా ఉంది. ప్రహ్లాద్‌కు కూడా పెళ్లయింది. ఇద్దరి మధ్య ఒక లేడీ కానిస్టేబుల్ విషయంలోనే గొడవ జరిగినట్లు చెబుతున్నారు.