* నల్లగొండ మున్సిపాలిటీలో 21 మంది సస్పెన్షన్
* అవినీతి ‘పుర' కథనంపై సర్కారు స్పందన
సాక్షి, హైదరాబాద్: పురపాలికల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సోమవారం ‘సాక్షి’లో అవినీతి ‘పుర’ం శీర్షికతో ప్రచురితమైన కథనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జల మండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్‌పై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం.. తాజాగా ఆస్తి పన్నులను దారిమళ్లించిన ఇంటి దొంగల ఆటకట్టించింది.
నల్లగొండ మున్సిపాలిటీలో ఏళ్ల తరబడిగా ఆస్తిపన్నుల మొత్తాలను దుర్వినియోగం చేస్తున్న 21 మంది ఉద్యోగులను మూకుమ్మడిగా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుడు బి.జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలో ఆస్తి పన్నుల వసూళ్లలో తీవ్ర అక్రమాలను గుర్తించిన పురపాలక శాఖ.. కొన్ని నెలల కింద స్టేట్ ఆడిట్ విభాగంతో ప్రత్యేక ఆడిట్ జరిపించింది. 2011-15 మధ్యకాలంలో జరిగిన లావాదేవీల్లో రూ.3,32,59,133 దుర్వినియోగమైనట్లు స్టేట్ ఆడిట్ విభాగం నివేదిక ఇచ్చింది.
ఆస్తి పన్నుల డిమాండ్లు, రసీదులతో పాటు ఖజానాలో జమ చేసిన బిల్లులకు ఏ మాత్రం పొంతన లేకపోవడం, రికార్డులను అడ్డగోలుగా దిద్ది లెక్కలను తారుమారు చేయడం తదితర లోపాల ఆధారంగా ఈ మేరకు అక్రమాలను నిర్ధారించారు. ఈ నివేదిక వచ్చిన వెంటనే అప్పట్లో అకౌంటెంట్ అరుణ కుమారితో పాటు మరో బిల్ కలెక్టర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టారు. మిగిలిన వారిపై చర్యలను పెండింగ్‌లో ఉంచి ఆడిట్ నివేదికపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీతో పునర్విచారణ జరిపించారు.
తాజాగా సాక్షిలో వచ్చిన కథనం నల్లగొండతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో జరిగిన అక్రమాలను ప్రముఖంగా ఎత్తిచూపింది. దీంతో తక్షణమే స్పందించిన పురపాలక శాఖ.. అక్రమాలకు బాధ్యులైన 21 మందిని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది. సస్పెండ్ అయిన వారిలో నలుగురు బిల్ కలెక్టర్లు, 16 మంది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఒక క్లర్కు ఉన్నారు.
అవినీతిపరులపై సర్కారు కొరడా
Published Thu, Sep 3 2015 1:51 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement