హైదరాబాద్, న్యూస్‌లైన్: తమ కుమార్తెకు పేరు పెట్టే విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం చివరికి పోలీసు స్టేషన్‌కు చేరింది. నగరంలోని యూసుఫ్‌గూడ బస్తీలో దీపక్ అనే ప్రైవేటు ఉద్యోగి ఏడాదిన్నర క్రితం సాజిదా అనే ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండు నెలల క్రితం పాప జన్మించింది. దీపక్ తన కుమార్తెకు లాస్య అని పేరు పెట్టాలని వాదిస్తే.. సాజిదా లీనా అని పెట్టాలని పట్టుపట్టారు.
ఇదిలా ఉండగా.. గురువారం ఉదయం దీపక్ తన కుమార్తెను తీసుకుని దగ్గర్లోని సాయిబాబా ఆలయానికి వెళ్లి.. లాస్య అని నామకరణం చేయించి, ఇంటికి తీసుకొచ్చారు. దీంతో తనకు తెలియకుండా పేరు ఎందుకు పెట్టావంటూ సాజిదా గొడవకు దిగారు. కోపం పట్టలేక దీపక్ భార్యపై చేయి చేసుకున్నారు. దీంతో ఆమె బట్టలు సర్దుకుని.. సామాన్లతో సహా ఆటోలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు దిగారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. ఇంత చిన్న ఘటనకే భర్తను వదిలి, సామాన్లతో సహా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సాజిదాను చూసి ఆశ్చర్య పోయిన పోలీసులు. భర్తను పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి.. సర్దిచెప్పి పంపించారు.
కుమార్తె ‘పేరు’ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వైనం
Published Fri, Nov 15 2013 2:48 AM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM
Advertisement