పితృత్వానికి సంబంధించి డీఎన్‌ఏ పరీక్ష ఫలితాన్నే కచ్చితమైన సాక్ష్యంగా పరిగణించాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: పితృత్వానికి సంబంధించి డీఎన్‌ఏ పరీక్ష ఫలితాన్నే కచ్చితమైన సాక్ష్యంగా పరిగణించాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. సంబంధిత చట్టంలో పేర్కొన్న ప్రకారం ఉన్న సాక్ష్యం, డీఎన్‌ఏ పరీక్ష ఫలితం.. ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు శాస్త్రీయంగా నిరూపితమైన డీఎన్‌ఏ పరీక్ష ఫలితాన్నే పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ సీకే ప్రసాద్, జస్టిస్ ఖేహర్‌ల ధర్మాసనం తేల్చి చెప్పింది.
డీఎన్‌ఏ పరీక్షలో తండ్రి కాదని తేలినప్పుడు.. ఆ వ్యక్తిని తండ్రి బాధ్యతలను నిర్వర్తించాల్సిందిగా బలవంతం చేయకూడదని పేర్కొంది. భార్యకు, కూతురికి భరణం ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించిన భర్త కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. కూతురు పుట్టే నాటికి తన భార్యతో శారీరక సంబంధం లేదని, ఆ పాప తన కూతురు కాదని ఆ భర్త వాదించారు. డీఎన్‌ఏ పరీక్షల ఫలితాన్ని ఆయన రుజువుగా చూపారు.