
కుంభకోణాల్లో మునిగి తేలుతున్నారు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదేళ్ల పాలనలో కుంభకోణాలు చేస్తే.. నరేంద్రమోదీ ప్రభుత్వం ఏడాదిన్నర లోపే అందులో మునిగి తేలుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. పార్టీ రాష్ట్రస్థాయి సమావేశాల సందర్భంగా నిజామాబాద్‌లోని కలెక్టరేట్ మైదానంలో బుధవారం బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఏచూరి మాట్లాడుతూ.. కుంభకోణాలకు పాల్పడిన మంత్రులను నిలువరించాలని మోదీని కోరితే కనీస స్పందన కూడా లేదని, పార్లమెంట్ సమయమంతా వృథా అరుునా ఏమీ పట్టనట్టుగా వ్యవహరించారన్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ సీఎంలపై వచ్చిన ఆరోపణలనూ పట్టించుకోలేదన్నారు. దేశంలో మతోన్మాద రాజకీయాలు పెరుగుతున్నాయని, హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. కాశ్మీర్ కోసం పాకిస్తాన్‌తో జరిగిన చర్చల నేపథ్యంలో తప్పుకోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. కాశ్మీర్‌లో భాగమేనని పాకిస్తాన్ ముందుగానే చెప్పినప్పుడు అసలు చర్చల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.
దేశంలో మార్కెట్ రంగానికి అనుగుణంగానే విద్యాకోర్సులు వస్తున్నాయి తప్ప విద్యార్థులకు అనుగుణంగా ఉండడం లేదన్నారు. నరేంద్రమోదీ ప్రధానిగా 24 దేశాలు పర్యటించినా దేశాభివృద్ధిపై మాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఉల్లిధరల నియంత్రణలో విఫలమయ్యారని, సబ్సిడీలు తగ్గించి ధరలు పెంచారని మండిపడ్డారు. కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైన విధానాలనే అవలంబిస్తున్నాయని విమర్శించారు.
బడా పారిశ్రామిక వేత్తలకు ఎర్రతివాచీ పరుస్తున్నారని, వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులపై మాత్రం వివక్ష చూపుతున్నారని అన్నారు. పేదరికంలో భారతదేశం ప్రపంచలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ర్టంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపు విద్యుత్ ఉద్యోగులు, 108 ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు సమ్మె చేశారని, వారి సమస్యలు పట్టించుకోకపోవడం వల్లే నిరసనకు దిగారు తప్ప ప్రతిపక్షాల ప్రోత్సాహంతో కాదని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణకు పట్టిన దెయ్యం కేసీఆర్ అని అన్నారు.
ఆయనకు చిత్తశుద్ధి ఉంటే గోదావరిపై ప్రాజెక్టుల డిజైన్ల మార్పు అంశాన్ని చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ఇంజనీర్లు, అఖిలపక్ష నాయకుల వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. ఆరోగ్యం కోసం చీప్ లిక్కర్ అంటు ఓ మంత్రి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. దళితులకు 10 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామన్న కేసీఆర్.. ఇప్పటికి 1,400 ఎకరాల భూమి మాత్రమే పంచారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఏ మంత్రినీ, ఎమ్మెల్యేనూ పట్టించుకోవడం లేదని, కేవలం హరీశ్‌రావు, కేటీఆర్, ఎంపీ కవిత కోసమే పాటుపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే లక్ష నాగళ్లతో రామోజీ ఫిల్మ్‌సిటీని దున్నిస్తామని ప్రకటించిన కేసీఆర్..ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నిం చారు. ‘నీకు చేతకాకుంటే నిజామాబాద్ జిల్లా నుంచి లక్ష నాగుళ్లు, ఇక్కడి రైతుల ట్రాక్టర్లను తీసుకొని వస్తా.. భూములను దున్నుతావా’ అని సవాల్ విసిరారు. ఒక చేతిలో గ్రామజ్యో తి, మరో చేతిలో చీప్‌లిక్కర్‌తో చావు జ్యోతి వెలిగించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారన్నారు.