ప్రధాని మోదీని దాటేసిన క్రికెటర్!
భారత క్రికెట్ వీరుడు విరాట్ కోహ్లికి మైదానంలో తిరుగులేదు. బౌలర్ ఎంతటి వాడైనా కోహ్లిని చూస్తే కాస్త వెనుకంజ వేస్తాడు. అంతటి సత్తా ఉన్న ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ తాజాగా ట్విట్టర్ ఇండియా వార్షిక నివేదికలోనూ టాప్ పొజిషన్‌లో నిలిచాడు. వెళ్లిపోతున్న ప్రస్తుత ఏడాదిలో అత్యంత ప్రభావవంతమైన ట్వీట్లను ట్విట్టర్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత ప్రభావవంతమైన ట్వీట్‌గా కోహ్లి అనుష్కను ఉద్దేశించి చేసిన ట్వీట్ నిలించింది. గోల్డన్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్‌గా ఘనత సాధించింది.
'అనుష్కశర్మను నిరంతరం కించపరుస్తున్న మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నా. కొంచెం కనికరం చూపండి. ఆమె నాకు ఎప్పుడూ సానకూల శక్తినే ఇచ్చింది' అంటూ కోహ్లి చేసిన ట్వీట్ రికార్డుస్థాయిలో 39వేలసార్లు రీట్వీట్ అయింది. టీ20 మ్యాచ్‌ల్లో తన వైఫల్యానికి అనుష్కనే కారణమంటూ నెటిజన్లు ఆమెను కించపరచడాన్ని తప్పుబడుతూ కోహ్లి చేసిన ఈ వ్యాఖ్యను లక్ష ఏడువేలమందికిపైగా లైక్ చేశారు. అనుష్కకు మద్దతుగా కోహ్లి తొలిసారి పెట్టిన ఈ ట్వీట్ స్రీన్‌షాట్ల రూపంలో ఫేస్‌బుక్‌లోనూ వైరల్ అయింది.
అయితే, ఆసక్తికరంగా కోహ్లి ట్వీట్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్‌ను బీట్ చేయడం గమనార్హం. పెద్దనోట్ల రద్దు విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ట్వీట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్ ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన ట్వీట్లలో రెండోస్థానంలో నిలిచింది. నోట్ల రద్దుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇక మూడో ప్రభావవంతమైన ట్వీట్‌గా 2016 టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. నాలుగో స్థానంలో రియో ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించిన దీపా కర్మాకర్, సాక్షి మాలిక్, పీవీ సింధు నిలిచారు.
Shame on people for trolling @AnushkaSharma non-stop. Have some compassion. She has always only given me positivity pic.twitter.com/OBIMA2EZKu
— Virat Kohli (@imVkohli) 28 March 2016