
మార్స్‌పై పంటలు!
అరుణ గ్రహాన్ని నివాసయోగ్యంగా మార్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా అక్కడి వాతావరణానికి అనుగుణంగా పంటలు పండించేందుకూ పరిశోధనలు జరుగుతున్నాయి.
వాషింగ్టన్: అరుణ గ్రహాన్ని నివాసయోగ్యంగా మార్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా అక్కడి వాతావరణానికి అనుగుణంగా పంటలు పండించేందుకూ పరిశోధనలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ స్టేట్ వర్సిటీ భౌతిక శాస్త్రవేత్త మైకెల్ అలెన్, వర్సిటీ ఆఫ్ ఇదాహో ఫుడ్ సైంటిస్టు హెలెన్ జాయినర్ కలసి ప్రయోగాలు చేస్తున్నారు. దీనిపై ఆసక్తి ఉన్న కొందరు విద్యార్థులను కలుపుకుపోతున్నారు. ‘మీరు అంగారకుడిపైకి వెళ్తే.. తినేందుకు ఏం కావాలి.. ఏమేం పండించుకోవాలనే దానిపై ఆలోచించండ’ని వారిని కోరారు.
‘అక్కడి వాతావరణంలో కార్బన్(జీవం పెరిగేందుకు ఆధారం), నైట్రోజన్(చెట్లు ప్రొటీన్ తయారు చేసుకునేందుకు అవసరం) ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. నీటి జాడలున్నట్లు అర్థమవుతోంది. ఇంకేం వీటి ఆధారంగా అక్కడ వ్యోమగాములు.. వారికి వారే పంటలు పండించుకునే ప్రయత్నం చేయాలి’ అని అలెన్ చెప్పారు.