
‘ఓటుకు కోట్లు’పై పార్లమెంటులో ఆందోళన
వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత మేకపాటి వెల్లడి
పుష్కరాల తొక్కిసలాటలో ఏపీ సీఎం నిర్వాకంపై నిరసన
న్యూఢిల్లీ: ప్రజా సమస్యలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమేయం ఉన్న ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంపై కూడా సభలో ఆందోళన చేపట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి ఆ సంఘటన మాయని మచ్చ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల జరిగి న తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయిన విషయంపై కూడా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. అలాగే ప్రజానుకూలంగా ఉన్న బిల్లులకు మద్దతివ్వనున్నట్లు వెల్లడించారు. భూసేకరణ బిల్లులో తమ సవరణలకు అనుకూలంగా ఉంటేనే దానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు. ప్రత్యేక హోదా హామీ అమలులో పురోగతిలేని విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించనున్నట్లు వెల్లడించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు పెంచకుండా ఆదర్శ శాంసద్ యోజన వంటి పథకాల అమలు సాధ్యం కాద ని స్పష్టం చేశారు.
‘హోదా’పై ఒత్తిడి: టీడీపీ లోక్‌సభాపక్ష నేత
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం వెల్లడించారు. ప్రస్తుత సమావేశాల్లో రాష్ట్ర విభజన చట్టం అమలుపైనే తమ ఎజెండా ఉంటుందని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని రైల్వేజోన్, ఓడరేవులు, మౌలిక వసతుల స్థాపనపై కేంద్రం తగిన కార్యాచరణ చేపట్టేలా ఒత్తిడి తెస్తామన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, స్పీకర్ సుమిత్రామహాజన్ సమక్షంలో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో కూడా తమ డిమాండ్లను వారి ముందుంచామని తెలిపారు. ఈ అంశాలను చర్చించేందుకు తగిన సందర్భాల్లో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు.