మెక్‌డోనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్‌లో బల్లి!
Published Fri, Mar 3 2017 10:32 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
ఆకలి వేస్తోందంటే ఇంట్లో రెండు దోశలు వేసుకుని తినడం పాత మాట. సరదాగా అలా బయటకు వెల్లి మెక్‌డోనాల్డ్స్‌లో బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం నేటి బాట. అయితే ఇలాగే ఆశగా ఫ్రెంచ్ ఫ్రైస్ తిందామని వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతాలోని ఈఎం బైపాస్ ఏరియాలో గల మెక్‌డోనాల్డ్స్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్‌తో పాటు చచ్చిన బల్లి ఒకటి వాళ్ల ప్లేట్లో దర్శనమిచ్చింది. ప్రియాంకా మొయిత్రా అనే మహిళ తన కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు.. ఆమె కూతురికి ఈ బల్లి కనిపించింది. తన నాలుగేళ్ల కూతురి పుట్టినరోజని తామంతా కలిసి రెస్టారెంటుకు వెళ్లామని, తీరా అక్కడ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసి తింటుండగా బల్లి కనపడటంతో తనకు వెంటనే వాంతులు వచ్చాయని ఆమె చెప్పారు. వెంటనే ఆ విషయాన్ని మేనేజర్‌కు చెప్పగా ఆయన తమకు క్షమాపణలు చెప్పి, వాటిని తీసేసి కొత్తగా మళ్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తామని చెప్పారని ప్రియాంక అన్నారు.
అయితే ప్రస్తుతం గర్భవతి అయిన ప్రియాంకకు కాసేపటి తర్వాత కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడంతో తన కూతురితో పాటు గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందారు. వెంటనే ముందుగా ప్లేటులో ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్‌తో పాటు చచ్చిన బల్లి ఫొటోను తీసుకున్నారు. ఆ ఫొటోతో కలిపి ఫూల్ బగన్ పోలీసు స్టేషన్‌లో మెక్‌డోనాల్డ్స్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యమని, ఇలాంటి విషాహారం తినడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అన్న విషయం ప్రజలకు తెలియాలని ప్రియాంక అన్నారు.
Advertisement
Advertisement