మిస్త్రీకి మరో షాక్!
ముంబై: టాటా గ్రూప్ ఛైర్మన్ గా తొలగించబడిన సైరస్ మిస్త్రీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛైర్మన్ గా తొలగించబడిన తరువాత ఆయన అధికారాలకు, పదవులకు చెక్ పెడుతున్న సంస్థ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూపుకు చెందిన టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్ పదవి నుంచి కూడా తొలగించింది. ఈ మేరకు సోమవారం జరిగిన షేర్ హోల్డర్స్ సమావేశంలో నిర్ణయం జరిగింది.
టాటా ఇండస్ట్రీస్ అసాధారణ సర్వ సభ్య సమావేశంలో (ఈజీఎం) ఆయన్ను డైరెక్టర్ గా తొలగిస్తూ నిర్ణయం జరింగింది. మిస్త్రీ తొలగింపుకు అనుకూలంగా వాటాదారులు ఓటు వేశారు. ఆయన డైరెక్టర్ గా కొనసాగితే టాటా గ్రూపు మరింత విచ్ఛిన్నమవుతుందని పేర్కొన్న సంస్థ ఆయన్ను తొలగించాల్సిందిగా వాటాదారులకు విజ్ఞప్తి చేసింది. అలాగే రానున్న రోజుల్లో మిస్త్రీ తొలగింపు కోసం మరో ఆరు టాటా గ్రూపులు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందే ఆయన్ను టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా తొలగించారు. తాజాగా డైరెక్టర్ పదవి నించి కూడా తొలగించిన టాటా సంస్థ మిస్త్రీపై మరింత పట్టు సాధించింది.
కాగా టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై గ్రూప్ కంపెనీలు కూడా వేటువేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీల చైర్మన్గా బోర్డు సభ్యుడిగా ఆయన్ని తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైరస్ మిస్త్రీ ఇక షేర్హోల్డర్స్ మద్దతుపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే.