డేటావిండ్ నుంచి 2జీ, 3జీ స్మార్ట్‌ఫోన్లు
న్యూఢిల్లీ: ప్రముఖ వైర్‌లెస్ వెబ్ యాక్సెస్ ఉత్పత్తుల సంస్థ డేటావిండ్ అందుబాటు ధరలలో 2జీ, 3జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. డ్యూయల్ సిమ్, 3.5 అంగుళాల తెర వంటి ప్రత్యేకతలున్న ‘పాకెట్‌సర్ఫర్ 2జీ4’ ఫోన్ ధర రూ.1,999గా, 3జీ నెట్‌వర్క్, డ్యూయల్ కెమెరా, డ్యూయల్ సిమ్, 4 అంగుళాల తెర వంటి ప్రత్యేకతలున్న ‘పాకెట్‌సర్ఫర్ 3జీ4’ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,999గా ఉంది. అలాగే 5 అంగుళాల తెర ఉన్న ‘పాకెట్‌సర్ఫర్ 3జీ5’ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,499గా ఉంది. కంపెనీ వీటికి ఒక ఏడాదిపాటు ఉచిత ఇంటర్‌నెట్ బ్రౌజింగ్ ఆఫర్‌ను అందిస్తోందని డేటావిండ్ సీఈఓ సునీత్ సింగ్ చెప్పారు.
దీని కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని అన్నారు. ‘ప్రతి ఏడాది ఫీచర్ ఫోన్ల అమ్మకాలు 15 కోట్ల యూనిట్లుగా ఉన్నాయి. దీనిలో మేమే 3 శాతం (45-50 లక్షల యూనిట్లు) వాటాను ఆక్రమించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీని కోసం ముఖ్యంగా టైర్-2, టైర్-3 పట్టణాలపై దృష్టి కేంద్రీకరించాం’ అని అన్నారు. ఈ నెల చివరకు 3,600 రిటైల్ షాపులలో మా స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని, వచ్చే త్రైమాసికానికి ఈ షాపుల సంఖ్య రెట్టింపు చేస్తామని చెప్పారు. రూ.3,000 లోపు ధర ఉన్న స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రతి నెల 1.3 కోట్లకు పైగా ఉన్నాయని తెలిపారు.