
‘హోదా’పై చర్చ జరగాలని అడిగాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను వైఎస్సార్‌సీపీ మరోసారి కేంద్రం ముందు ఉంచింది. బుధవారం ఇక్కడ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అధ్యక్షతన పార్లమెంటులో జరిపిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి హోదా విషయంలో నాటి ప్రధాని హామీని ప్రస్తావించామని, వరద సాయంపై అడిగినట్లు మేకపాటి తెలిపారు. వెంకయ్య, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ ఇతర మంత్రులు, పలు పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మేకపాటి విలేకరులతో మాట్లాడారు.
ఉమ్మడి తీర్మానాన్ని స్వాగతించాం..
‘అందరూ 26, 27 తేదీల్లో బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్లమెంటులో జరిగే ప్రత్యేక చర్చ విషయం అఖిలపక్షంలో చర్చించారు. ఉమ్మడి తీర్మానం ఉండాలన్నారు. దీన్ని వైఎస్సార్‌సీపీ స్వాగతించింది. అలాగే కొన్ని జిల్లాల్లో కరువు, తాజాగా అతివృష్టి, వరద పరిస్థితులు నెలకొన్నాయి.కేంద్రం అన్ని విధాలుగా సాయం చేయాలని అడిగాం. ఎంపీ ల్యాడ్స్ పెంచాలని కోరాం. పార్లమెంటు సమావేశాల్లోనూ సుదీర్ఘంగా మట్లాడతాం.’ అని మేకపాటి పేర్కొన్నారు.
‘హోదా’ హామీని ప్రస్తావించాం..
‘రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా సహా అన్ని హామీలూ నిలబెట్టుకోవాలి. నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ప్రస్తావించాం. ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వైఎస్సార్సీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లోటుబడ్జెట్‌ను పూడ్చుకోవచ్చు. దానిపై పట్టుపడతాం’ అన్నారు. మత అసహనం చర్చలో మీ పార్టీ వైఖరేంటన్న ప్రశ్నకు మేకపాటి స్పందిస్తూ.. అన్ని మతాలనూ సమానంగా చూడాలన్నారు.