సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడుతున్నట్లు పైకి హడావుడి చేస్తున్న సీఎం చంద్రబాబు తెరవెనుక రాజీ ప్రయత్నాలు చేయటం నిజమేనని తేలిపోయింది! బీజేపీతో రాజీ కోసం తన సన్నిహితుడైన సుజనా చౌదరిని ఆయన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వద్దకు పంపారు. ఈ విషయాన్ని సుజనాయే స్వయంగా వెల్లడించడం గమనార్హం.
హోదా మినహా మిగతా వాటిపై సుముఖం?
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో శుక్రవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో తాను అరుణ్ జైట్లీతో మాట్లాడినట్లు సుజనా చౌదరి వెల్లడించారు. రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం లాంటి వాటిపై జైట్లీ సానుకూలంగా మాట్లాడారన్నారు. ప్రత్యేక హోదా మినహా మిగిలిన అన్ని అంశాలపైనా కేంద్ర పెద్దలు సుముఖంగా ఉన్నారని, ఇప్పుడేం చేద్దామని కాన్ఫరెన్స్‌లోనే ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు కేంద్రంతో రాజీకి సుజనాచౌదరిని రంగంలోకి దించినట్లు బహిర్గతమైంది.
కేంద్రమే నేరుగా చెప్పాలన్న యనమల
కేంద్రమే నేరుగా ఈ విషయాలపై మాట్లాడితే బాగుంటుందని సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. మనమే కేంద్ర మంత్రులను కలిస్తే జనంలో వ్యతిరేకత వస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాధానం కూడా చెప్పుకోలేమని అన్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబు జోక్యం చేసుకుని కేంద్ర పెద్దలు కనిపించినప్పుడు మర్యాదగా పలకరించాలని మిగిలిన విషయాలపై ఏం చేద్దామో ఆలోచిద్దామని చెబుతూనే అయినా ఇలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడితే ఎలా? అని సుజనాపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈశాన్య రాష్ట్రాలకు రూ.మూడు వేల కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చే నిధుల్లో మాత్రం కోత విధిస్తోందనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.
మళ్లీ కలిసేందుకు తహతహ
అరుణ్‌జైట్లీతో సుజనా సమావేశమైన విషయం అనూహ్యంగా బయటపడిపోవడంతో టీడీపీ నాయకుల మధ్య ఈ అంశం చర్చనీయాంశమైంది. పార్టీలో పైకి కనిపించేది వేరు లోపల జరిగేది వేరని, కేంద్రంతో మళ్లీ కలిసేందుకు తమ నేత ప్రయత్నిస్తున్నారని టీడీపీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ సీపీ ప్రకటనతో ప్రకంపనలు
నాలుగేళ్లపాటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించి ఎన్డీఏ నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్న టీడీపీ కొద్ది రోజుల క్రితమే బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ స్వరం మార్చటం తెలి సిందే. కేంద్రంపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని వైఎస్సార్ సీపీ చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకం పనలు సృష్టించటంతో ఉలిక్కిపడ్డ సీఎం చంద్రబాబు తాము కూడా అదే తీర్మానంపై నోటీసులిస్తున్నట్లు చెప్పారు. ఇన్నాళ్లూ కేంద్రంలో కొనసాగుతూ అంతా సవ్యంగా ఉందని చెప్పిన చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రాగానే మాట మార్చారు. తనపై కేసులు పెట్టే అవకాశం ఉందని, కక్ష సాధిం పులు పెరుగుతాయని, అన్నిటికీ సిద్ధంగా ఉండాలంటూ పదేపదే చెబుతున్నారు. ఓ ఎంపీగా తాను ప్రధాని కార్యాలయానికి వెళితే తప్పేమిటని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబు సమాధానం చెప్పడంలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై పార్లమెంటులో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment