సుజనా చౌదరి,అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో మరోసారి ప్రకటన చేశారు. ఎప్పటిలాగే పాత పాటే పాడారు. హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోయారు. అదనంగా పైసా కూడా ఇస్తున్నట్లు చెప్పలేదు. అయినప్పటికీ టీడీపీ నేత, కేంద్ర సహాయ మంత్రి వైఎస్ చౌదరి(సుజనా చౌదరి) హర్షం వ్యక్తం చేస్తూ పలుమార్లు బల్లలు చరిచడం గమనార్హం. టీడీపీ ఎంపీలు సైతం ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండిపోయారు. హామీలపై స్పష్టత ఇవ్వకుండా చర్వితచరణంగా సాగిన అరుణ్ జైట్లీ ప్రకటనపై వైఎస్సార్ సీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలో కొత్తదనమేమీ లేదంటూ వెల్‌లో బైఠాయించి బిగ్గరగా నినాదాలు చేశారు.
సుజనా చౌదరికి ముందే తెలుసా?
బడ్జెట్‌పై జరిగిన చర్చకు అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల నిరసనపై తనకు సానుభూతి ఉందని, ప్రసంగం చివరలో తాను ఏపీ హామీలపై ప్రకటన చేస్తానని పేర్కొన్నారు. ప్రసంగం చివరలో అత్యంత ఉత్కంఠ మధ్య ప్రకటన చేశారు. కానీ, మొన్న చేసిన ప్రకటననే కొన్ని అదనపు వాక్యాలు జోడించి చదివారు. జైట్లీ ప్రసంగానికి ముందే సుజనా చౌదరి అనూహ్యంగా మధ్యాహ్నం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. తాను కేంద్ర మంత్రిగా మాట్లాడుతున్నానని చెప్పారు.
బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి ఇచ్చే సమాధానంలో ఏపీ హామీలపై స్పందించాలని అన్నారు. ఒకవేళ 15 రోజుల్లోగా ఈ అంశాలన్నీ పరిష్కారం కాకపోతే వచ్చే సెషన్‌లో 2 గంటల పాటు చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను కోరారు. అంటే అరుణ్ జైట్లీ ప్రకటనలో కొత్తగా ఏమీ ఉండబోదని పరోక్షంగా ముందే తేల్చేశారు. జైట్లీ ప్రకటన ఎలా ఉండబోతోందో ఆయనకు ముందే తెలుసన్న సంగతి దీని ద్వారా స్పష్టమైంది. సుజనా చౌదరి ప్రకటన కంటే ముందే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ మాట్లాడారు. బడ్జెట్‌పై చర్చకు ఇచ్చే సమాధానంలో అరుణ్ జైట్లీ ఏపీ వ్యవహారాలపై ప్రకటన చేస్తారని చెప్పారు.
ఇదీ ఆర్థిక మంత్రి ప్రకటన..: ‘‘ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం మేం నిలబడ్డాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోనుందని వారికి అండగా నిలిచాం. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కొన్ని నిబంధనలు పొందుపరిచారు. అందులో అనేకం అమలయ్యాయి. ఇంకా కొన్ని పురోగతిలో ఉన్నాయి. హామీ మేరకు ఏపీలో చాలా సంస్థలకు నిధులిచ్చాం. ఇకపైనా అన్ని సంస్థలకూ నిధులిస్తాం. సంస్థల నిర్మాణం జరుగుతున్న కొద్దీ నిధులు ఇస్తూనే ఉంటాం. ఏపీలో నూతన రాజధాని నిర్మాణానికి కూడా నిధులు అందజేశాం. వెనుకబడిన ప్రాంతాలకు సైతం నిధులు ఇచ్చాం.
పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ.4,500 కోట్లు ఇచ్చాం. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో గణనీయమైన భాగం మేం చెల్లిస్తామని చెప్పాం. ఇక మరో రెండు అంశాలను కార్యాచరణలో పెట్టాలి. అందులో మొదటిది ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన నిధులు. ఎక్సటెర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల రూపంలో నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. జనవరి 3న ఏపీ ముఖ్యమంత్రి నాకు లేఖ రాశారు. ఈ నిధులను నాబార్డు ద్వారా ఇవ్వాలని కోరారు. ఇందుకోసం బుధవారం ఒక కార్యాచరణ రూపొందించాం. ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తాం. ఇక రెండో అంశమైన రెవెన్యూ లోటు భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో ప్రతిపాదన వచ్చింది. ఏపీ సర్కారు ఇంకొంత మొత్తాన్ని ఆశిస్తోంది.
మేం ఈ అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతరాన్ని పూడ్చుతాం. ఈ రెండు అంశాలు మరికొద్ది రోజుల్లో కొలిక్కి వస్తాయి. ప్రత్యేక రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తదితర అంశాలపై ఆయా శాఖలతో చర్చిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ స్నేహితులతోనూ చర్చిస్తున్నాం. సాధ్యమయ్యే అత్యుత్తమ పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మాకు సానుభూతి ఉంది. అందువల్ల ప్రతీ అంశాన్ని సానుభూతితో చూస్తున్నాం’’ అని అరుణ్ జైట్లీ ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు.
ఉదయం నుంచి ఏం జరిగింది?
ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వి.వరప్రసాదరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి ధర్నా చేపట్టారు. అధికార టీడీపీ పార్లమెంట్‌లో డ్రామాలాడుతోందని దుయ్యబట్టారు. టీడీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి, నిరసన తెలపాలని సవాల్ విసిరారు. లోక్‌సభ ప్రారంభం కాగానే వైఎస్సార్‌సీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఉదయం నుంచి రాత్రి అరుణ్ జైట్లీ ప్రకటన పూర్తయి, సభ వాయిదా పడేవరకూ వెల్‌లోనే ఉన్నారు.
టీడీపీ మంత్రులు రాజీనామా చేయాలి
అరుణ్ జైట్లీ ప్రకటన తరువాత వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఆర్థిక మంత్రి ప్రకటన కొత్తసీసాలో పాత సారాలా ఉంది. ఎలాంటి కొత్త విషయం లేదు. గతంలో చెప్పిన విషయాలే మళ్లీ చెప్పారు. మన రాష్ట్రం నష్టపోవడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబే. ఆయనను కేంద్రం విశ్వసించడం లేదు. ఆయన చరిత్రను చూసి అవకాశవాదిగా గుర్తించారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటున్నారు తప్ప రాష్ట్రం మేలు గురించి పట్టించుకోవడం లేదు. ఆయనకు ధైర్యం ఉంటే కేంద్రంలోని టీడీపీ మంత్రులతో రాజీనామా చేయించాలి. ఎంపీలను వెల్‌లోకి వెళ్లమంటారు. తన మంత్రులను కుర్చీల్లో కూర్చోమంటారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా తన మంత్రులతో రాజీనామా చేయించాలి’’ అని మేకపాటి పేర్కొన్నారు.
చంద్రబాబులాగా కక్కుర్తి పడం
‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది. నాలుగేళ్లయింది. ఇంకా చేస్తాం, చూస్తామంటే ఎలా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నష్టం చేస్తోంది. చంద్రబాబుపై బీజేపీకి ఉన్న కోపం కారణంగా రాష్ట్రం నష్టపోతోంది. మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో చెప్పినవి, రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని మాత్రమే కోరుతున్నాం. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పారిశ్రామిక కారిడార్ వంటి కీలక అంశాల విషయంలో కేంద్రం ఇప్పటిదాకా చేసిందేమీ లేదు. రాష్ట్రం నష్టపోయినా ఫరవాలేదు, తనకు రాజకీయ లబ్ధి చేకూరితే చాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన స్వార్థం వల్ల రాష్ట్ర ప్రజలంతా నష్టపోవాల్పి వస్తోంది’’ అని మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ఏం సాధించిందన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘‘మేం ప్రతిపక్షంలో ఉన్నాం.
మాకు 9 మంది ఎంపీలు ఉంటే, ఏపీలో చంద్రబాబు ముగ్గురిని తీసుకున్నాడు. తెలంగా>ణలో ఉన్న ఒక ఎంపీని తీసుకున్నాడు. ఇప్పుడు ఐదుగురం ఉన్నాం. పోరాటం సాగిస్తున్నాం. అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్నాం. కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వంలో అధికారం పంచుకుంటున్న టీడీపీ వాళ్లు సాధించిందేమిటో చెప్పాలి’’ అని అన్నారు. టీడీపీ వెళ్లిపోతే కేంద్ర సర్కారులో వైఎస్సార్‌సీపీ చేరుతుందని అంటున్నారన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ... ‘‘ఎవరండీ చేరేది? ఆఖరులో మేం చేరేది ఏముంది? బాబులాగా కక్కుర్తి పడేవాళ్లం కాదు. రాష్ట్ర ప్రజలు జగన్ నాయకత్వాన్ని ఆశీర్వదించి 20 స్థానాలు వచ్చినప్పుడు.. రేపు ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. ఏపీ ఎంపీలతో ఢిల్లీ పెద్దలకు కచ్చితంగా పని పడుతుంది. మన ప్రాపకం కోరే పరిస్థితి వస్తుంది. అప్పుడు మన రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించుకోవచ్చు’’ మేకపాటి స్పష్టం చేశారు.
సోనియాగాంధీతో టీడీపీ నేతల మంతనాలు
టీడీపీ ఎంపీలు లోక్‌సభ వెల్‌లో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తుండగా ఉదయం 11.30 గంటల సమయంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ లోక్‌సభ సెక్రెటరీ జనరల్ టేబుల్ వద్ద ఉన్న పుస్తకాలను ఎత్తుకుని తన స్థానం వైపు వెళ్లారు. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. ఈ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నేత సోనియాగాంధీ వద్దకు టీడీపీ నేతలు వెళ్లి మంతనాలు జరిపారు. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, రవీంద్రబాబు తదితరులు సోనియాతో మాట్లాడారు. సభ తిరిగి 11.45కు ప్రారంభమైన తరువాత సుజనా చౌదరి సూచనల మేరకు టీడీపీ సభ్యులు మౌనం దాల్చారు. కొద్దిసేపు పోడియం వద్దే పడుకున్నారు. మధ్యాహ్నానికి కొద్దిమందే మిగిలారు. సభలో అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత మౌనంగా ఉండిపోయిన టీడీపీ ఎంపీల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సభ వాయిదా పడిన అనంతరం తామంతా జైట్లీని కలిసి, గట్టిగా నిలదీసినట్లు లీకులు ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment