
అన్నాడీఎంకే శ్రేణులకు జయ మేనకోడలి పిలుపు!
- మీ మద్దతుకు కృతజ్ఞతలు.. శాంతంగా ఉండండి
- సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా..
- అన్నాడీఎంకే, తమిళనాడును సరైన దారిలో నడుపుతా
చెన్నై: జయలలిత మరణానంతరం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె మేనకోడలు దీపాజయకుమార్ గురువారం కీలక ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లోకి వచ్చే విషయమై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని, అది సమీప భవిష్యత్తులోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో శాంతియుతంగా ఉండాలని అన్నాడీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వారసురాలు దీపేనంటూ అన్నాడీఎంకే శ్రేణులు తమిళనాడులోని పలుచోట్ల బ్యానర్లు, కటౌట్లు పెడుతున్నారు. అయితే, ప్రస్తుతం ఇలా తన కటౌట్లు, బ్యానర్లు పెట్టడం ఆపాలని ఆమె పార్టీ కార్యకర్తలను కోరారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నిజమైన అన్నాడీఎంకే కార్యకర్తలు శాంతంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వారి మద్దతును తాను ఎన్నడూ మరిచిపోనని వ్యాఖ్యానించారు. జయలలిత మృతితో తమిళనాడు రాజకీయాలలో తీవ్ర శూన్యత ఏర్పడిందని, ప్రస్తుతం తాను తన అత్త మృతితో సంతాప భావనలో ఉన్నానని, తనకు కొంత సమయంలో ఇవ్వాలని ఆమె కోరారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని, అది సమీప భవిష్యత్తులోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జయలలిత ఆశీస్సులతోనే తాను ముందుకు సాగుతానని, ఆమె తరహాలోనే అన్నాడీఎంకేను, తమిళనాడును సరైన దారిలో నడిపించేందుకు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.