మరింత దారుణంగా ఢిల్లీ పరిస్థితి!
న్యూఢిల్లీ : అసలకే కాలుష్యంతో మొదటిస్థానంలో ఉండే ఢిల్లీ నగర పరిస్థితి దివాళి అనంతరం మరింత దారుణంగా మారింది. ఢిల్లీ, నేషనల్ రాజధాని పరిసరి ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రమైన స్థాయిలో పెరిగిందని ఎయిర్ మానిటరింగ్ ఏజెన్సీలు గణాంకాలు తెలిపాయి. ఎన్సీఆర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయంపూట, మంచు మాదిరి పూర్తిగా పొగ కమ్ముకుని ఉండిపోయిందని, రోడ్లు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నాయి. ఈ కాలుష్య స్థాయిలు ఢిల్లీ నగరంలో 14 రెట్లు పెరిగాయని తెలిపాయి. సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం కాలుష్యభరితమైన ప్రాంతాల్లో 2.5 పీఎం స్థాయి ఒక్కో క్యూబిక్ మీటర్కు 431మైక్రోన్స్గా ఉంది. దీంతో విషవాయువుల వల్ల ప్రజలకు శ్వాస తీసుకోవడం కష్టతరంగా మారిందని ఏజెన్సీలు వెల్లడించాయి. దుమ్ము, ధూళి, వాహనాల కాలుష్యంతో పాటు టపాసుల కాలుష్యం కూడా తోడైందని పేర్కొన్నాయి.
అనంద్ విహార్, ఆర్.కే పురమ్, దిల్షద్ గార్డెన్, షాదీపుర్, మందీర్ మార్గ్, పంజాబి బాగ్(వెస్ట్ ఢిల్లీ)ల ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో కాలుష్య స్థాయిలను ఈ గణాంకాలు విడుదలచేశాయి. పెద్ద ఎత్తున్న దివాళి టపాసుల పేల్చడంతోనే ఎన్నో విషపూరితమైన గ్యాస్లు గాలులోకి విడుదలయ్యాయని, అక్టోబర్ 30న తీవ్రమైన స్థాయికి చేరి, అక్టోబర్ 31న దారుణంగా మారిందని తెలిపాయి. పోస్టు దివాళి అనంతరం సరిహద్దు ప్రాంతాలు ఆగ్రా, గుర్గావ్లలో కాలుష్య పీఎం2.5 స్థాయిలు 494, 500లకు చేరుకున్నాయి. ఈ దట్టమైన పొగతో ఢిల్లీ నోయిడా డైరెక్ట్ ఫైవేపై ఐదు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అయితే ఎవరికి ఎలాంటి హానీ జరుగలేదు.