అరవింద్ కేజ్రీవాల్కు అస్వస్థత
న్యూఢిల్లీ : రెండు రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన ఈరోజు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కాగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలైన ప్రతి ఇంటికి 700 లీటర్ల మంచినీరు సరఫరాపై నేడు సమావేశమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే కేజ్రీవాల్ అనారోగ్యం కారణంగా ఇంటి దగ్గర నుంచే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.
నిన్నటి నుంచి తనకు 102 జ్వరం ఉందని, జ్వరంతో పాటు లూజ్ మోషన్స్ అవుతున్నట్లు ఈ రోజు ఉదయం కేజ్రీవాల్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అందువల్ల సోమవారం కార్యాలయానికి హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. మంచినీటి సరఫరాపై నేడు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అయితే భగవంతుడు రాంగ్ టైమ్లో అనారోగ్యం కలిగించాడని అన్నారు.
కాగా కేజ్రీవాల్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆయన రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. ఈ సందర్భంగా వైద్యుడు బిపిన్ మిట్టల్ మాట్లాడుతూ కేజ్రీవాల్ డయేరియాతో బాధపడుతున్నారని, ఆయనకు విశ్రాంతి అవసరమని తెలిపారు. కేజ్రీవాల్ గత నెలరోజుల నుంచి దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. ఆదివారం తనను కలిసేందుకు వచ్చినవారిని కూడా ఆయన జ్వరం కారణంగా కలవలేకపోయారు.