
జిగిషాను అపహరించి.. హతమార్చారు!
- ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: ఏడేళ్ల కిందట దేశ రాజధాని హస్తినను కుదిపేసిన ఐటీ ఉద్యోగిని జిగిషా ఘోష్ హత్యకేసులో ఢిల్లీ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈకేసులోని ముగ్గురు నిందితులనూ దోషులుగా తేల్చింది. నిందితులు అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, రవికపూర్ పై హత్య, నేరపూరిత కుట్ర, అపహరణ, దోపిడీ అభియోగాలు రుజువైనట్టు పేర్కొంది.
2009 మార్చిలో జిగిషా దారుణ హత్యకు గురైంది. ఢిల్లీ వసంత్ విహార్ లోని ఐటీ కంపెనీ నుంచి నోయిడాలోని తన ఇంటికి జిగిషా బయలుదేరింది. కంపెనీ క్యాబ్ ఆమెను ఇంటివద్ద దిగబెట్టినప్పటికీ.. ఆమె ఇంటికి చేరలేదు. కొన్నిరోజుల తర్వాత ఆమె మృతదేహం సూరజ్ కుండ్ లో లభించింది. ఆమె మొబైల్ ఫోన్లను నిందితులు ఒకదానిని వెళుతున్న ట్రాక్ లో, మరోదానిని రోడ్డుపై వదిలేశారు.
ముగ్గురు నిందితులు దోపిడీ చేసే ఉద్దేశంతోనే జిగిషాను ఆమె అపార్ట్ మెంట్ వద్దే అపహరించి.. అనంతరం హత్యచేశారు. జిగీషా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు కనుగొనడంతో ఈ హత్య మిస్టరీనే కాకుండా 2009 సెప్టెంబర్ 30న జరిగిన మహిళా జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసు చిక్కుముడి కూడా ముడింది. దోపిడీ చేసే ఉద్దేశంతోనే నిందితులు సౌమ్యను, జిగిషాను హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు.