న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం నడిరోడ్డుపై పదహారేళ్ల బాలికను అత్యంత పాశవికంగా 20సార్లకుపైగా పొడిచి, సిమెంట్ శ్లాబ్‌తో పుర్రె పగిలేలా మోదిన ఉదంతంలో నిందితుడు ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు సాహిల్‌ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే పోలీసుల దర్యాప్తులో హత్యోదంతం తాలూకు పలు అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
హత్య నేరాన్ని పోలీసుల విచారణలో సాహిల్ ఒప్పుకున్నాడు. పక్కా ప్రణాళికతోనే అదే చోట చంపాలని ముందే నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. సన్నిహితంగా ఉండే బాలిక సాక్షి తనను దూరంగా పెట్టడం సాహిల్‌కు నచ్చలేదు. బంధం కొనసాగించాలని కోరగా తన స్నేహితురాళ్ల సమక్షంలోనే సాక్షి ఇతడిని తిరస్కరించింది. సన్నిహితంగా ఉండాలని బలవంతం చేస్తే చితకబాదుతామని సాక్షి స్నేహితులు సాహిల్‌ను హెచ్చరించారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
హత్యకు ఉపయోగించిన కత్తిని 15 రోజుల క్రితమే హరిద్వార్ నుంచి తీసుకొచ్చాడు. హత్య చేశాక పారిపోతూ కత్తిని రిఠాలా మెట్రో స్టేషన్ దగ్గరి పొదల్లో పడేశాడు. తర్వాత బులంద్‌షహర్‌లోని తన అత్తయ్య ఇంటికి వెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాక ఇంటికి ఫోన్‌చేశాడు. ఆ ఫోన్‌కాల్ సాయంతో జాడ కనిపెట్టి పోలీసులు ఇతడిని పట్టుకున్నారు. సాక్షి శరీరంపై 34 లోతైన గాయాలు ఉన్నాయని, పుర్రె పగిలిందని పోలీసులు వెల్లడించారు.
2021 జూన్ నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉండగా విడిపోదామని ఇటీవల చెప్పడంతో గత ఎనిమిదిరోజులుగా వారి మధ్య గొడవలు అవుతున్నాయి. ఆర్థికంగా స్థితిమంతుడైన తన మాజీ ప్రియుడితో మళ్లీ టచ్‌లోకి రావడంతోనే గొడవ పెరిగిందని సాహిల్ చెప్పాడు. కాగా, సాక్షి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment