పార్లమెంటు వద్ద పరుగులు పెట్టించిన టైరు
సోమవారం ఉదయం.. పార్లమెంటు సమావేశాలు అప్పటికే ప్రారంభమయ్యాయి.. ఈలోపు పార్లమెంటు ఆవరణకు సమీపంలోని విజయ్ ఘాట్ వద్ద ఉన్నట్టుండి పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. దాంతో భద్రతా దళాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అసలే పంజాబ్ గురుదాస్పూర్ కాల్పుల ఘటనతో తీవ్రం ఆందోళనలో పడిపోయిన సెక్యూరిటీ వర్గాలు ఈ పేలుడుతో పరుగులు పెట్టాయి. మరో టెర్రర్ ఎటాక్ జరిగిందేమోనని కంగారు పడ్డాయి. తీరా చూస్తే.. పేలింది ఒక బస్సు టైరు అని తెలిసి ఊపిరి పీల్చుకున్నాయి. పార్లమెంటు ఆవరణకు సమీపంలో విజయ్ ఘాట్ దగ్గర ఈ పేలుడు సంభవించిందని పోలీస్ వర్గాలు ప్రకటించాయి. ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నాయి.
మరోవైపు ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో పంజాబ్లోని దీనానగర్ పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి కాల్పులకు తెగబడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. దీనికి సంధించిన, కేంద్ర హోం శాఖ, ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెంటనే స్పందించాయి. పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్ వైపు నుంచి రాజధాని నగరంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీసు అధికారులను కూడా వదలకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. న్యూఢిల్లీలోని దాదాపు 180 పోలీస్ స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చాలాప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక దళాలు, ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.