ప్రజాభద్రతలో పోలీసుల రాజీ: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల తీరుపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డెన్మార్క్‌కు చెందిన 51 ఏళ్ల పర్యాటకురాలిపై మంగళవారం జరిగిన గ్యాంగ్‌రేప్ సహా ఇటీవల కాలంలో మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుల వైఖరిని కేజ్రీవాల్ ఎండగట్టారు. ప్రజాభద్రత విషయంలో పోలీసులు బాగా రాజీపడ్డారని ఘాటుగా విమర్శించారు.
నగరంలో చిన్నా చితక నేరాలేమైనా జరగట్లేదంటే అందుకు దేవుడి దయే కారణమన్నారు. నగరంలో మహిళలపై అత్యాచారాలు పెరగడానికిగల కారణాలను విశ్లేషించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తోపాటు పోలీసు కమిషనర్ బి.ఎస్. బస్సీతో భేటీఅవుతానన్నారు. మరోవైపు డెన్మార్క్ మహిళపై గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసులు గురువారం రాజు అలియాస్ బజ్జి (25) అనే మూడో అనుమానితుడిని అరెస్టు చేశారు.