న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించింది. ఇందుకోసం అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఢిల్లీ పోలీసులు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉండాలని ఆ తీర్మానంలో పేర్కొంది.
ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా హోం మంత్రి సత్యేంద్ర జైన్ ఈ తీర్మానాన్ని సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఢిల్లీలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, గతవారం ఢిల్లీ సచివాలయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కారం పొడితో దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి బీజేపీ, ఢిల్లీ పోలీసులే కారణమని ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తమ నాయకులపై బీజేపీ నేతలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకురావాలనే డిమాండ్ తెరమీదకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఢిల్లీలో సీపీఎస్ రద్దు: కేజ్రీవాల్
ఢిల్లీలో నూతన పెన్షన్ విధానం(సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు సోమవారం ఢిల్లీలో కదం తొక్కారు. ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ఇక్కడి రాంలీలా మైదానంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ధర్నాకు సీఎం కేజ్రీవాల్ వచ్చారు. పాత పెన్షన్ విధానం అమలుకోసం సోమవారమే ప్రత్యేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడం బాధాకరం అన్నారు. అందుకే ఢిల్లీలో సీపీఎస్ రద్దు చేశానన్నారు.
పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఏపీ ప్రభుత్వాలతో మాట్లాడి ఆయా రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దుకు కృషి చేస్తానన్నారు. ఢిల్లీలో సీపీఎస్ రద్దుచేస్తున్నందుకు ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి స్థిత ప్రజ్ఞ... సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ధర్నాలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment