న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా పట్ల నగర పోలీసులు వ్యవహరించిన తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దేశ రాజధానిలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చిన సమయంలో.. సిసోడియాను పోలీసులు మెడ పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం కేజ్రీవాల్ ఓ వీడియో విడుదల చేశారు.
సిసోడియాను మెడ పట్టుకొని లాక్కెళ్లిన పోలీసులు?
ఇందులో ఢిల్లీ కోర్టుకు భారీ భద్రత నడుమ పోలీసులు సిసోడియాను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మీడియా వారి వద్దకు చేరుకొని ప్రశ్నలు అడుగుతుంటే పోలీస్ అధికారి ఏకే సింగ్ రిపోర్టర్లను దూరంగా నెట్టడానికి ప్రయత్నించారు. కోర్టు ఆవరణలో సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, మోదీ చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఓ పోలీస్ అధికారి సిసోడియాను మాట్లాడనివ్వకుండా మెడ పట్టుకొని తీసుకెళ్లిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
కేజ్రీవాల్ ఆగ్రహం
ఈ వీడియోపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. మనీష్ సిసోడియాతో ఇలా అనుచితంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా? అని ప్రశ్నించారు. ఇలా చేయమని పైనుంచి (కేంద్రం లోని మోదీ సర్కార్) పోలీసులకు ఆదేశాలొచ్చాయా? అని మండిపడ్డారు. మనీష్‌తో పోలీసుల దురుసు ప్రవర్తన షాక్‌కు గురిచేసిందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి పేర్కొన్నారు. సిసోడియా పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
क्या पुलिस को इस तरह मनीष जी के साथ दुर्व्यवहार करने का अधिकार है? क्या पुलिस को ऐसा करने के लिए ऊपर से कहा गया है? https://t.co/izPacU6SHI
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 23, 2023
ఖండించిన పోలీసులు
అయితే ఆప్ ఆరోపణలను ఢిల్లీ పోలీస్‌లు కొట్టి పారేశారు. ఇదంతా దుష్ప్రచారంగా పేర్కొన్నారు. వీడియోలో కనిపిస్తున్న పోలీసుల చర్య భద్రత దృష్ట్యా సహజమేనని.. నిందితులు ఎవరైనా మీడియాకు స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం చట్టవిరుద్ధమని పోలీసులు ట్వీట్ చేశారు.
సిసోడియా కస్టడీ పొడిగింపు
కాగా, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సిసోడియాను పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు జూన్ 1వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది.
Comments
Please login to add a commentAdd a comment