న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భద్రతను కుదించారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు గురువారం ఆరోపించాయి. గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం కేజ్రీవాల్ రోడ్ షో ఉంది. కేజ్రీవాల్ భద్రతను తగ్గించారన్న ఆరోపణలను కేంద్ర హోం శాఖ కొట్టి వేసింది. ‘గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ఆప్ ప్రశంసనీయ ఫలితాలు సాధించడంతో.. బీజేపీ నాయకత్వ ప్రోద్బలంపై కేజ్రీవాల్ భద్రతను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు’ అని ఆప్ వర్గాలు ఆరోపించాయి.
కేజ్రీవాల్ సెక్యూరిటీలోని ఢిల్లీ పోలీసులకు చెందిన ఆరుగురు కమెండోలు ఉండాల్సి ఉండగా, రెండుకు తగ్గించారని పేర్కొన్నాయి. కేజ్రీవాల్ సెక్యూరిటీని తగ్గించలేదని, ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగుతోందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. సాధారణ మార్పుల్లో భాగంగా నలుగురు కమెండోలను మార్చామని, వారి సంఖ్య తగ్గించలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment