పార్టీలో నా మీద కుట్ర చేసి తీసేశారు: మాజీ మంత్రి
ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత రాజకీయాలకు తాను బలైపోయానని ఢిల్లీ ఆహారశాఖ మాజీమంత్రి ఆసిఫ్ అహ్మద్ ఖాన్ చెప్పారు. ఓ బిల్డర్ను రూ. 6 లక్షల లంచం అడిగినట్లు వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం టీవీ లైవ్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తనను చంపుతానంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని కూడా ఖాన్ చెప్పారు.
వాస్తవానికి తనను ఇరికించినట్లు చెబుతున్న టేపులో మధ్యవర్తిగా వినిపించిన గొంతు ఆమ్ ఆద్మీ పార్టీ మైనారిటీ విభాగం ఉపాధ్యక్షుడు షకీల్ మాలిక్దని అహ్మద్ ఖాన్ అన్నారు. తనను బలిపశువుగా చేసి పంపేశారని ఆయన మీడియాతో చెప్పారు. వేరే పెద్దవాళ్లను రక్షించడం కోసం తనను బలిచేశారన్నారు. ఇప్పుడు కొత్తగా మంత్రి పదవి చేపట్టిన ఇమ్రాన్ హుస్సేన్ ఏమంత గొప్పవాడని ఖాన్ ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులకు ఆయనపై పలు రకాల ఫిర్యాదులు అందాయని చెప్పారు.