ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
జగన్ మండిపాటు.. నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్పీకర్ కేవలం పది సెకన్లలో బిల్లును చదివి, అదే పది సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టామని చెప్పారని, దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పార్లమెంట్‌లో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజున పార్లమెంట్‌లో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. కొన్ని టీవీ చానళ్లలో స్పీకర్ వ్యాఖ్యలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారని స్పీకర్ అంటున్నారు. వాస్తవానికి లోక్‌సభలో ప్రజాస్వామ్యం ఖూనీ మా అందరి ముందే జరిగింది. పదే పది సెకన్లలో స్పీకర్ వ చ్చారు.. వచ్చి బిల్లును ప్రవేశపెట్టడం అయిపోయిందని అన్నారు. బిల్లును సభలో పెట్టాలంటే.. అలా ప్రవేశపెట్టడం తమకు ఆమోదయోగ్యమో, కాదో చెబుతూ సభ్యులు చేతులు పెకైత్తాలి. చేతులు ఎంతమంది పెకైత్తారో చూసుకొని దాన్ని బట్టి బిల్లు ప్రవేశపెట్టామని లేక ప్రవేశపెట్టలేదు అని చెప్పాలి. కానీ సభలో సభ్యులు అవుననో, కాదనో చెప్పింది ఎక్కడ? అలాంటిది ఏమీ జరుగకుండానే పదే సెకన్లలో బిల్లు పెట్టేశారట. ఇంతకన్నా అన్యాయమైన ప్రజాస్వామ్యాన్ని ఎక్కడా చూడలేదు’ అని విమర్శించారు. గురువారం లోక్‌సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలతో కలిసి జగన్‌మోహన్‌రెడ్డి విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘ఢిల్లీలో 272 మంది ఎంపీలతో ప్రధాని కుర్చీలో కూర్చుంటే చాలు.. ఆ తర్వాత అడ్డగోలుగా ఏ రాష్ట్రాన్నైనా విభజిస్తామన్న కొత్త నడవడికకు నేడు నాంది పలుకుతున్నారు. ఇది అన్యాయం. దీన్ని అందరూ ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రతిఘటిస్తూ రేపు(శుక్రవారం) వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నాం’ అని తెలిపారు.
హిట్లర్ కంటే దారుణంగా...
బిల్లు పెట్టిన తీరుపై తాము స్పీకర్‌ను కలిస్తే.. బిల్లు పెట్టడం అయిపోయిందంటూ నిర్మొహమాటంగా చెప్పారంటూ జగన్ విమర్శించారు. ‘నేను, బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అద్వానీ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన శైలేంద్ర కుమార్, జేడీయూ అధినేత శరద్ యాదవ్, ఏఐడీఎంకే నేత తంబిదొరైలు కలిసి స్పీకర్‌ను ఆమె చాంబర్‌లో కలిసి ఇలా బిల్లు ప్రవేశపెట్టడం చాలా అన్యాయమని చెప్పాం. అయితే స్పీకర్ మీరా కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, కేంద్ర హోంమంత్రి షిండే ముగ్గురూ కలిసి ‘బిల్లు పెట్టేశాం, అయిపోయింది’ అని నిర్మొహమాటంగా చెప్పారు. దీంతో నేను, సుష్మా, అద్వానీ, తంబిదొరై, రాజ్‌బబ్బర్ బయటకొచ్చేశాం’ అని జగన్ వెల్లడించారు. ఏకంగా 16 మందిని సభ నుంచి సస్పెండ్ చేశారని, వారిలో 14 మంది సీమాంధ్రకు చెందినవారని చెప్పారు.
పజాస్వామ్య పద్ధతుల్లో బిల్లు పెట్టకున్నా.. పెట్టినట్లు చెబుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం బతికుందా? లేదా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర కు చెందిన 14 మందిని సస్పెండ్ చేస్తే ఓటింగ్ జరిగితే ఎవరూ అడ్డుకోకుండా చేయాలనే ఓ పథకం ప్రకారం వ్యవహరించారని అన్నారు. నిజంగా హిట్లర్ ఇంత అన్యాయంగా చేస్తారో, చెయ్యరో తెలియదు కానీ మనదేశంలో సోనియాగాంధీ హిట్లర్‌ను మించి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వీళ్లు మనుషులా? రాక్షసులా? అని ప్రశ్నించారు. ఇటువంటి అన్యాయమైన విషయాన్ని మీడియా, సోషల్ మీడియా, ప్రతిపక్షాలు కలసిక ట్టుగా అడ్డుకోవాలని కోరారు. అలా చేయకుంటే నేడు ఏపీలో జరుగుతున్నదే రేప్పొద్దున తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ లేదా మరో రాష్ట్రానికి జరుగుతుందని హెచ్చరించారు.
లేదంటే రెండు ప్రాంతాలవాళ్లం దెబ్బతింటాం
ఇదే సమయంలో లోక్‌సభలో ఎంపీలు కొట్టుకున్నారు, దీన్ని ఎలా చూస్తారు అని అడగ్గా ‘ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కొట్టుకున్నట్లు ఎవరో తీసిన వీడియో క్లిప్పింగ్‌లు చూస్తే తెలుస్తోంది. పొద్దున్నే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వచ్చారు. తన పార్టీకి చెందిన తెలంగాణ వారితోనూ, సీమాంధ్ర వారితోనూ మాట్లాడారు. ఇద్దరూ కలిసి మీ ఇష్టమొచ్చింది చేసుకోండని సూచించారు. అక్కడికి వెళ్లాక కొట్టుకున్నది ఎవరో కాదు, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, రమేశ్ రాథోడ్‌లే. టీడీపీకి చెందిన ఈ ఇద్దరే పార్లమెంట్‌లో కొట్టుకున్నట్లుగా వీడియోలో కనిపించింది’ అని జగన్ అన్నారు. ఇదే సమయంలో ఇలాంటి వ్యవస్థ మారాలని అన్నారు. ‘సమైక్యం అంటే దానర్థం తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర అని. మూడు ప్రాంతాల్లోనూ అన్నదమ్ములమని చెప్పేదే సమైక్యం. అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయకుంటే.. బంగారంలాంటి రాష్ట్రం నాశనం అవుతుంది. రెండు ప్రాంతాల వారం దెబ్బతింటాం’ అని పేర్కొన్నారు.
బీజేపీ కలిసొస్తుందన్న నమ్మకం ఉంది..
విభజన బిల్లును వ్యతిరేకించే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కలిసొస్తుందా అని అడగ్గా.. ‘బీజేపీ మాతో కలిసొస్తుందన్న నమ్మకం చాలా ఉంది. ప్రతిపక్షాలన్నీ జరుగుతున్న అన్యాయాన్ని చూశాయి. వారంతా ముందుకొస్తారని నమ్మకం ఉంది. ఈ రెండు రోజుల్లో మిగతా నాయకులను కలిసే ప్రయత్నం చేస్తాం. అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తాం. విభజనను ఆపేందుకు అంతా కలిసిరావాలి’ అని అన్నారు. చంద్రబాబు సైతం మీతో కలిసి రావాలని అంటున్నారా? అని ప్రశ్నించగా ‘ఆయన నోటితో జై సమైక్యాంధ్ర అంటూ ముందుకొచ్చి పార్టీ నేతలందరికీ ఒకే రకమైన విప్ జారీచేసే మార్పు ఆయనలో రావాలి. ఆయనలో మార్పు రావాలని, చరిత్రహీనుడిగా మారొద్దని దేవున్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా’ అని అన్నారు.
లగడపాటికి సమర్థన..
ఇక ఇదే సమయంలో లోక్‌సభలో లగడపాటి తీరును సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించగా ‘లగడపాటి మంచిపని చేశారు. పెప్పర్ స్ప్రే తీసుకొని కొట్టారు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి హానీ ఉండదు. చనిపోయే పరిస్థితి రాదు. అక్కా చెల్లెళ్లు ఒంటరిగా పోయేటప్పుడు పెప్పర్ స్ప్రేనే తీసుకొని వెళ్తారు. ఎవరన్నా వారి మీద దాడిచేస్తే దీన్ని వాడతారు. దానివల్ల కాస్త కళ్లు మండుతాయి. కాస్త దగ్గొస్తుంది. ముక్కులో కాస్త ఇబ్బంది తలెత్తుతుంది. అంతేతప్ప ఇంకోటి జరగదు. తనకు జరుగుతున్న అన్యాయం చూసి ఆయన తనకు అనిపించింది నిరసనల రూపంలో తెలిపారు. దీన్ని పూర్తిగా సమర్థిస్తున్నా’ అని పేర్కొన్నారు.