నోట్ల రద్దుపై సుందర్ పిచాయ్ కామెంట్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై టెక్నో దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. ఈ అంశంలో తాను నిపుణుడిని కాకపోయినా ఇది సాహసోపేతమైన నిర్ణయమని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో గూగుల్ సంస్థ ఏ విధంగానైనా సాయం చేసే అవకాశముంటే అందుకు తాము సిద్దమని ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఓ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా నోట్ల రద్దుపై స్పందించాలని కోరగా.. ‘పెద్ద వేదికలలో మార్పులు తీసుకొచ్చినప్పుడు విశేషమైన ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ప్రజలకు ఫోన్లు ఉండి.. వాటిలో లోకేషన్ గుర్తించే వీలుండటం రైడ్-షేరింగ్ (క్యాబ్) సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రవాణా వ్యవస్థలో విశేషమైన మార్పులు వచ్చాయి. అదేవిధంగా పెద్దనోట్ల రద్దును నేను తక్కువ అంచనా వేయను. భారత్‌లో ఇలాంటి వాటి వల్ల విశేషమైన బహుళ ప్రభావాలు ఉంటాయి. ఇతర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనే భారత్ ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ల్యాండ్ లైన్లకు బదులు సెల్‌ఫోన్లు వాడుతున్నాం. అదేవిధంగా డిజిటల్ చెల్లింపులు దేశానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి. ప్రజలు అనుకుంటున్న దానికన్నా మెరుగైన మౌలికవసతులు దేశంలో ఉన్నాయి’ అని ఆయన అన్నారు.