డీమానిటైజేషన్: ఉప్పు పరిశ్రమ
అహ్మదాబాద్: డీమానిటైజేషన్ ప్రభావంతో ఉప్పు ఉత్పత్తిదారులు కూడా తగిన చర్యలకు ఉపక్రమించారు. నగదు రహిత లావాదేవీలు కోసం ముందుకొచ్చిన ఉప్పు తయారీదారులు కార్మికులందరికీ బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. జీతాలు చెల్లింపులో ఆలస్యం ఉత్పత్తిని ప్రభావితం చేయొచ్చనే ఆందోళన, రుతుపవనాలు అనంతరం ఉప్పు ఉత్పత్తికి సీజన్ ప్రారంభం కావడంతో తయారీదారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ఉప్పు పరిశ్రమలో సుమారు 400,000 పనివారు ఉన్నారని ఉప్పు తయారీదారులు చెపుతున్నారు. దాదాపు 75-80 శాతం వలస కార్మికులు ఉన్నారనీ, నగదుకొరతతో వీరికి వేతనాలు చెల్లింపు ఇబ్బంది మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సకాలంలో వారికి జీతాలు చెల్లించలేకపోతే, దాని ప్రభావం ఉప్పు తయారీపై పడుతుందని, తాత్కాలికంగా నిలిపివేసే పరిస్థితి దారితీయవచ్చన్నారు. అందుకే కార్మికులకు బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నామని ఉప్పు తయారీదారుల అసోసియేషన్ అధ్యక్షుడు భరత రావల్ తెలిపారు. ఇందుకు జిల్లా కలెక్టర్, బ్యాంకు అధికారులతో చర్చించడంతోపాటు,సంబంధిత పత్రాల సమర్పణ కోసం కార్మికులకు సహకరిస్తున్నామని చెప్పారు.
డీమానిటైజేషన్ మంచి ఎత్తుగడ అనీ , మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ జలాన్ తెలిపారు. ఇది దీర్ఘకాలంలో తమతో సహా అన్ని వర్గాల కార్మికులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతానికి సరిపడా ఉప్పు నిల్వలు న్నాయని పేర్కొన్నారు. వలస కార్మికుల డాక్యుమెంటేషన్ పెద్ద సమస్యగా పరిణమించిందని కాంట్రాక్టర్లు చెప్పారు. వారివారి సొంత గ్రామాలనుంచి సంబంధిత గుర్తింపు పత్రాలను సేకరిస్తున్నట్టు కచ్ ప్రాంతంలోని కాంట్రాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు.
తాము ఇప్పటికే నగదు రహిత లావాదేవీలను ప్రక్రియ మొదలుపెట్టామని దేవ్ ఉప్పు ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ జీఎస్ ఝాలా తెలిపారు. కార్మికులం సంక్షేమం, తద్వారా ఉప్పు సరఫరాలో ఎటువంటి సమస్య రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
మరోవైపు డీమానిటైజేషన్ ప్రభావం మిగిలిన అన్ని పరిశ్రమలతో పాటు ఉప్పు పరిశ్రమపై కూడా పడింది. కాస్టిక్ సోడా తదితర సోడా ఉత్పత్తులపై ఇప్పటివరకు కొద్దిమేర ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలుచెబుతున్నాయి.
కాగా దేశంలో సంవత్సరం ఉప్పు 27.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవుతుంది. ఇందులో1.4 మిలియన్ టన్నులు పారిశ్రామిక అవసరాల కోసం 6.6 మిలియన్ టన్నులు ఆహారంలో వినియోగం కో్సంకేటాయిస్తారు. ఆరు మిలియన్ టన్నుల ఎగుమతి చేస్తుంటారు. కాగా గుజరాత్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. గుజరాత్ లో 22.7 మిలియన్ టన్నులు, రాజస్థాన్లో 2.4 మిలియన్లు, తమిళనాడు లో దాదాపు రెండు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి జరుగుతుంది.