‘నో అకౌంట్’లోనూ మనం ఘనులమే
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాత నోట్ల నగదు మార్పిడికి ఇచ్చిన గడువు ముగిసి పోవడంతో బ్యాంకు ఖాతాలులేని ప్రజల ఇబ్బందులు ఎక్కువయ్యాయి. బ్యాంకులకు వెళ్లి ఖాతాలు తెరుద్దామంటే విధి నిర్వహణలో తలమున్కలై ఉన్న బ్యాంకు సిబ్బంది తర్వాత రమ్మని తిప్పి పంపిస్తున్నారు. ఎలాంటి గుర్తింపులేని వలస ప్రజలకు ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు అవకాశం ఇవ్వడం లేదు. ఏం చేయాలో తోచ క వారంతా మీడియా ముందు గోడు వెల్లబోసుకుంటున్నారు.
పాత 500, 1000 రూపాయల నోట్లతో కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు అవకాశం ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ఎప్పుడో చెప్పినప్పటికీ ఆ దిశగా నిర్దిష్టమైన ఉత్తర్వులు జారీ చేయలేదు. ‘ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ ఇండియా’ 2015లో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో 23.30 కోట్ల మంది ప్రజలకు బ్యాంకు ఖాతాలు లేవు. ప్రపంచంలో బ్యాంకు ఖాతాల్లేని అతి పెద్ద దేశాల్లో భారత్ ఏడవ స్థానంలో ఉంది. అంటే ఇది బంగ్లాదేశ్ జనాభాకన్నా ఎక్కువ. 2011లో బ్యాంక్ ఖాతాల్లేని వారి సంఖ్య 55.70 కోట్ల మంది ఉండేవారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన’ పథకం కింద దాదాపు 21 కోట్ల ఖాతాలను తెరవడం వల్ల ఖాతాలేని వారి సంఖ్య 23.30 కోట్లుకు పడిపోయింది.
2016 జూన్ నాటికి జన్‌ధన్ యోజన కింద మరో 6.80 కోట్ల మంది ఖాతాలు తెరిచారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వారి లెక్కలను కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం 16.50 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. వీరంతా పేద వర్గాలు, నిరక్ష రాస్యులే. సరైన గుర్తింపు కార్డులు లేనివారే. సరే, ఏదోరకంగా ప్రభుత్వం వీరికి కూడా బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు అవకాశం ఇస్తే బ్యాంకులపై అదనపు భారం ఎంతో పడుతుంది. ఇప్పటికే సకాలంలో విధులు నిర్వర్తించలేకపోతున్న బ్యాంకులు ఈ అదనపు భారాన్ని ఎలా భరిస్తాయన్నది మరో ప్రశ్న.
ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది ప్రజలకు సరాసరి సగటున 43 ఏటీఎంలు ఉండగా, భారత్‌లో 18 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. బ్యాంకుల బ్రాంచిల విషయంలో మాత్రం లక్ష మందికి 13.4 బ్యాంకుల బ్రాంచిలతో దాదాపు ప్రపంచ సగటుకు సమానంగా ఉంది. కానీ అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాలన్నీ డిజిటల్ క్యాష్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుండగా, భారత్ మాత్రం ఎంతో వెనకబడి పోయింది.