ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ వ్యవహరంపై అమెరికా స్పందన మరవకముందే.. అగ్రరాజ్యం భారత్‌కు సంబంధించిన మరో అంశంపై స్పందించింది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహరంపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భారత్‌లోని అమెరికా దౌత్యవేత్తకు బుధవారం సమన్లు కూడా జారీ చేయటం తెలిసిందే. అయితే ఘటన మరవకముందే అమెరికా భారత్‌కు సంబంధించిన మరో అంశంపై స్పందించటం గమనార్హం.
తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించిన అంశంపై మరోసారి అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ప్రచారం చేయకుండా ఆ పార్టీకి సంబంధించిన పలు బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు మాకు తెలుసు. ఈ విషయంలో కూడా మేము పారదర్శకత, సమయానుకూల న్యాయ ప్రక్రియను ప్రోత్సహిస్తాం’ అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాత్యు మిల్లర్ అన్నారు.
అయితే సీఎం కేజ్రీవాల్ విషయంలో స్పందించిన అమెరికా రాయబారికి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ.. ఆదేశ దౌత్యవేతకు భారత్ ఇచ్చిన సమన్లపై స్పందింస్తూ.. ‘నేను ప్రైవేట్ దౌత్యపరమైన వ్యాఖ్యలు చేయదలుచుకోలేను. కానీ, సీఎం కేజ్రీవాల్ విషయంలో నేను ఇక్కడి నుంచే బహిరంగంగా మేము పారదర్శకత, సమయానుకూల న్యాయప్రక్రియను ప్రోత్సహిస్తాం అని. మా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే మేం పట్టించుకోం. ఇదే విషయాన్ని మేము ప్రైవేట్‌గా కూడా ఇలాగే స్పష్టం చేస్తాం’అని మాత్యు మిల్లర్ స్పష్టం చేశారు.
గత లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 210 కోట్ల ఆదాయపన్ను కట్టాలంటూ తమ పార్టీకి చెందిన నాలుగు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసిందని, వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతా కూడా ఉందని ఇటీవల కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా అమెరికా స్పందించటం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. దీనికి భారత్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment