న్యూఢిల్లీ: సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికుల కోసం కార్మిక శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికమంత్రిత్వ శాఖతో కలిసి కార్మికులకు బ్యాంకు ఖాతాల కోసం స్పెషల్ డ్రైవ్ ఈ (శనివారం) నుంచే మొదలు కానుంది. నవంబర్ 26, 2016 నుంచి ప్రత్యేక శిబిరాలద్వారా బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ప్రతి జిల్లాలో నిర్దిష్ట ప్రాంతాల్లో ఈ డ్రైవ్ ను నిర్వహించనుంచనుంది. డిజిటల్ లావాదేవీలను మరింత తీవ్రం చేసే యోచనలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో తెలిపారు.
ఫైనాన్షియల్ శాఖ సేవల సహకారంతో ఈ ప్రచారం ప్రారంభించనున్నట్టు దత్తాత్రేయ వెల్లడించారు. ఇకపై యజమానులు నేరుగా కాకుండా బ్యాంకుల ద్వారానే కార్మిక వేతనాలు చెల్లించేలా ఖాతాలు లేని కార్మికులందరికీ తక్షణమే సమీప బ్యాంకుల్లో కొత్త ఖాతాలు అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో చాలా చురుకుగా ఉన్నామని, ఈ విషయంలో సహరాన్ని అభ్యర్థిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం పంపామని మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం జనధన్ యోజన ద్వారా 2014 తరువాత 25 కోట్లపై పైగా బ్యాంకు ఖాతాలను తెరిచినట్టు చెప్పారు. తద్వారా దేశవ్యాప్తంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకంతో కోట్లాదిమంది పేదవారికి లబ్ధి చేకూరినట్టు చెప్పారు. ఆర్ధికపరమైన ప్రతి లావాదేవీ డిజిటలైజేషన్ తోపాటుపారదర్శకంగా జరగాలన్నదే తమ అభిమతమని కేంద్ర మంత్రి వివరించారు.