న్యూఢిల్లీ: మౌలిక రంగానికి నిధుల లభ్యతను పెంచే క్రమంలో దేశీయంగా తొలిసారి ష్యూరిటీ బాండ్ల బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. డిసెంబర్ 19న దీన్ని ఆవిష్కరించనున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ పథకంతో కాంట్రాక్టర్లకు భారీగా ఊరట లభించగలదన్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు .. కాంట్రాక్టరు తరఫున బీమా కంపెనీ ఈ ష్యూరిటీ బాండును జారీ చేస్తుంది.
ఇదీ చదవండి: సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?
ప్రాజెక్టు పనితీరుకు లేదా సకాలంలో పూర్తి చేయడానికి సంబంధించి ఇది హామీగా పని చేస్తుంది. ఒకవేళ కాంట్రాక్టరు గానీ హామీ నిలబెట్టుకోలేకపోతే ప్రాజెక్టు ఇచ్చిన సంస్థ ఈ బాండు ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవడానికి వీలవుతుంది. ఫైనాన్షియల్ గ్యారంటీలో ఆర్థికపరమైన అంశాలు ఇమిడి ఉండగా.. ష్యూరిటీ బాండ్లలో పనితీరు సంబంధిత అంశాలు ఉంటాయి. ప్రస్తుతం కాంట్రాక్టర్లు భారీ మొత్తాలను ఫైనాన్షియల్ గ్యారంటీ చూపించేందుకు కేటాయించాల్సి వస్తోందని, ష్యూరిటీ బాండ్లను ప్రవేశపెడితే వారికి ఆయా నిధులు అందుబాటులోకి రాగలవని గడ్కరీ చెప్పారు. ఈ నిధులను వారు వ్యాపార వృద్ధికి ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తద్వారా మౌలిక రంగంలో నిధుల లభ్యతను పెంచుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడగలవని మంత్రి చెప్పారు. (రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్)
ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (ఇన్విట్స్)లో పెట్టుబడి పెట్టడం ద్వారా దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో రిటైల్ ఇన్వెస్టర్లు పాలుపంచుకో వచ్చని గడ్కరీ తెలిపారు. ఇన్విట్స్ ద్వారా దాదాపు ఎనిమిది శాతం రాబడులు కూడా అందుకోవచ్చన్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా పూర్తి స్వదేశీ, చౌక నిర్మాణ విధానాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. (రూపాయిల్లో వాణిజ్యంపై బ్యాంకుల అవగాహన కార్యక్రమాలు)
Comments
Please login to add a commentAdd a comment