క్యూ లైన్లో గుండెపోటు వచ్చి..
న్యూఢిల్లీ: ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకునేందుకు గంటల తరబడి వేచి చూసిన ఓ వ్యక్తి హఠాత్తుగా గుండె పోటు వచ్చి మరణించిన సంఘటన దేశ రాజధానిలో బుధవారం చోటు చేసుకుంది. పాత ఢిల్లీకి చెందిన సవూద్ ఉర్ రెహమాన్(48) లాల్ కువాన్ లోని బ్యాంకు వద్ద ఎనిమిది గంటలకు పైగా క్యూలో నిల్చున్నారు. దీంతో అస్వస్ధతకు గురయ్యారు. ఇది గమనించిన తోటి వ్యక్తులు ఆయన్ను దగ్గరలోని లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించే లోపలే ప్రాణాలు విడిచారు.
రెహమాన్ గత రెండు రోజులుగా డబ్బు తీసుకోవడానికి బ్యాంకు వద్దకు వస్తున్నట్లు తెలిసింది. ఏటీఎంలలో డబ్బు అయిపోతుండటంతో తెల్లవారుజామునే బ్యాంకు వద్దుకు వచ్చి క్యూలో నిల్చున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం 11.45 నిమిషాలకు తనకు ఆరోగ్యం బాగాలేదని ఫోన్ లో కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. అంతలోనే గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఎక్కువ సేపు క్యూలో నిల్చొనివుండటం, ఆహారం తీసుకోకపోవడం వల్లే రెహమాన్ మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు.