వెరీగుడ్ తెలంగాణ!
మానవ వనరుల శాఖ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం విధించిన నిర్ణీత గడువు (ఆగస్టు 15)కు ముందే ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాలను పూర్తి చేసి రాష్ట్రం భేష్ అనిపించుకుంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమీక్షలో తెలంగాణ విద్యాశాఖకు ప్రశంసలు తెలియజేసింది. గడిచిన మూడు నెలల్లో 14,526 మరుగుదొడ్లను నిర్మించి రాష్ట్రం రికార్డు సృష్టించింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మిస్తున్న మరో 267 టాయిలెట్లు రెండు మూడు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో 3,079 పాఠశాలల్లో చేపట్టిన బోర్లు వేయడం, పైపులైన్ల నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి.
మొత్తంగా 36,224 మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టగా శుక్రవారం నాటికి 35,957 వినియోగంలోకి తెచ్చింది. ఏపీలో ఇంకా 10,363 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీంతో కేంద్రం ఏపీ చేపట్టిన చర్యలపై కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.