Department of Human Resources
-
విద్యార్థులంతా స్వదేశంలోనే చదువుకునేలా ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దేశంలోనే అధిక సంఖ్యలో విద్యార్థులకు చదువుకునే అవకాశాలు కల్పించేందుకు, కోవిడ్–19 కారణంగా విదేశాల నుంచి తిరిగివచ్చే విద్యార్థులకు సైతం ఇక్కడ చదువు కొనసాగించే అవకాశం కల్పించే లక్ష్యంతో రూపొందించే కార్యక్రమానికి మార్గదర్శకాలను తయారుచేయడం కోసం మానవ వనరుల శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ సారథ్యంలోని ఈ కమిటీ, ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో మరింత మందిని చేర్చుకునే అవకాశాలపై సైతం సిఫారసులు చేయనుంది. ఈ కమిటీ 15 రోజుల్లోగా తన రిపోర్టు అందించాల్సి ఉంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న అనేక మంది విద్యార్థులు కోవిడ్ –19 కారణంగా యిప్పుడు భారత్‌లోనే చదువుకోవాలని భావిస్తున్నారు. అమెరికా నుంచి భారత్‌కి తిరిగి వచ్చే విద్యార్థుల సంఖ్య సైతం పెరుగుతోంది’’అని ‘‘స్టే ఇన్ ఇండియా అండ్ స్టడీ ఇన్ ఇండియా’’కార్యక్రమంలో హెచ్చార్డీ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ చెప్పారు. గత ఏడాది 7.5 లక్షల మంది విద్యార్థులు తమ చదువుకోసం విదేశాలకు వెళ్ళారని ఆయన చెప్పారు. ‘‘ఈ ప్రతిభావంతులైన విద్యార్థులందర్నీ మన దేశంలోనే చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టాలి’’అలాగే ప్రభుత్వం ప్రణాళికలో పేర్కొన్నట్లు ప్రముఖ విద్యాలయాలన్నింటిలోనూ 2024 కల్లా సీట్ల సామర్థ్యాన్ని 50 శాతం పెంచాలనీ, 2024కి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను 50కి పెంచాలని మంత్రి నిశాంక్ అన్నారు. -
బాలికలదే హవా
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈసారి సీబీఎస్ఈ పదవతరగతి ఫలితాల్లో రికార్డు స్థాయిలో 91.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఫలితాలతో పోల్చుకుంటే ఈసారి ఉత్తీర్ణతా శాతం స్వల్పంగా పెరిగి, 0.36 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 90 శాతంపైగా మార్కులు సాధించిన విద్యార్థులు 3 శాతం తగ్గగా, 95 శాతానికి పైగా మార్కులు సాధించిన వారు 1 శాతం తగ్గారు. (ఫలితాలు వచ్చిన రోజు ఇదీ పరిస్థితి!) సీబీఎస్ఈ బోర్డు ఎటువంటి మెరిట్ లిస్ట్‌ను ప్రకటించలేదు. మొత్తం 1.5 లక్షల మంది విద్యార్థులు కంపార్ట్మెంట్లో పాస య్యారు. మొత్తం మీద 1.84 లక్షల మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించగా, 41,000 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించారు. గత సంవత్సరం 80.97 శాతం ఉండగా, ఈ సంవత్సరం ఉత్తీర్ణత 85.86 శాతంగా ఉంది. 99.23 శాతం ఉత్తీర్ణతతో కేంద్రీయ విద్యాలయాలు అగ్రస్థానంలో నిలవగా, 98.66 ఉత్తీర్ణతా శాతంతో జవహర్ నవోదయ విద్యాలయాలు తరువాత స్థానంలో నిలిచాయి. (సీబీఎస్ఈ ఫలితాలు.. సమానంగా కవలల మార్కులు) -
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను తన అధికారిక వెబ్సైట్ www.cbseresults.nicలో అందుబాటులో ఉంచినట్టు సీబీఎస్ఈ పేర్కొంది. అలాగే, www.cbse.nic.in వెబ్సైట్లో కూడా ఫలితాలు చూసుకోవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ప్రభుత్వ సర్వీసులను అందించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే, 011-24300699 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవడానికి వీలు కల్పించారు. ఈ విద్యా సంవత్సరం సీబీఎస్ఈ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా కరోనా మహమ్మారి తెరమీదకు రావడంతో కొన్ని సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించకుండానే వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడిన పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్న అంశం ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. కరోనా మహమ్మారి మరింత తీవ్రమవుతున్న పరిస్థితుల్లో మిగిలిన పరీక్షలను రద్దు చేసింది. రద్దు చేసిన పరీక్షలకు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సుప్రీంకోర్టుకు తెలియజేసిన రీతిలో మార్కులను కేటాయించిట్టు సీబీఎస్ఈ తెలియజేసింది. ఆ రకంగా అన్ని పరీక్షలకు మదింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బుధవారం తుది ఫలితాలను విడుదల చేశారు. 12వ తరగతి ఫలితాలు సీబీఎస్ఈ సోమవారమే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. (సీబీఎస్ఈ ‘12’లో బాలికలదే పైచేయి). ఈ ఏడాది పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 91.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఫలితాలతో పోల్చితే ఇది 0.36 శాతం అధికం. ఫలితాల్లో బాలికలు అత్యధికంగా 93.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 90.14 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మొత్తం ఫలితాల్లో 41,804 (2.23 శాతం) మంది విద్యార్థులు 95 శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. -
స్టూడెంటే నం.1
సాక్షి, అమరావతి : దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో బోధనాభ్యాసన ప్రక్రియల్లో సమూల మార్పులకు కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయించింది. పాత మూస ధోరణులను వదిలి అధునాతన ప్రణాళికలు, బోధనా విధానాలు అనుసరించేలా కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు సంబంధించి వర్సిటీలతో పాటు అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో వీటిని పాటించాల్సిందిగా సూచించింది. ఆయా సంస్థల్లో ఇకపై విద్యార్థి కేంద్ర బిందువుగా పాఠ్య ప్రణాళిక, బోధనాభ్యాసన విధానాలను అమలుచేయాల్సి ఉంటుంది. ‘స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్’ పేరిట ఈ మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ (యూజీసీ) విడుదల చేసింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలుచేసేలా ఉన్నత విద్యాసం స్థలన్నీ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విద్యార్థులను నూతన ఆలోచనల దిశగా ముందుకు తీసుకువెళ్లడం.. సామాజిక అంశాలపై సునిశితం గా స్పందించడం.. నైతిక విలువలను పెంపొం దించుకోవడం.. బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఇందులోని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. కొత్తవిధానంలో ప్రధానాంశాలు.. ప్రస్తుతం నాలుగు గోడల మధ్య పుస్తకాల ఆధారంగా సాగే బోధనకు బదులు సామాజికీకరణ, అనుసంధానత, పాలనా భాగ స్వామ్యం, అనుభవీకరణ అనేవి ఈ విధానంలో ప్రధానాంశాలుగా పొందుపరిచారు. - కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులు సౌకర్యవంతంగా తమ చదువు కొనసాగిం చేందుకు సీనియర్ విద్యార్థులు, అధ్యాప కులతో మార్గనిర్దేశం చేస్తారు. దీనివల్ల విద్యా ర్థులు ఉత్సాహపూరిత వాతావరణంలో చదువుకునేందుకు వీలుంటుంది. - ముందుగా సంస్థలోని విద్యార్థులు, అధ్యాప కుల మధ్య అనుబంధం ఏర్పడేలాచేయాలి. - సంస్థ విధానాలు, కార్యక్రమాలు, విలువలు, మెంటార్ గ్రూపులపై ముందుగా వారికి అవ గాహన కల్పించాలి. - నిపుణులతో ఉపన్యాసాలు ఇప్పించాలి. ఆయా విద్యా సంస్థల పరిధిలోని స్థానిక అం శాలపై అవగాహన కలిగేలా విద్యార్థులతో పర్యటనలు చేయించాలి. - గ్రూపు చర్చలు, సబ్జెక్టు అంశాలపై ప్రసంగాలు, అభ్యసన నైపుణ్యాలు, కళలు, సాహిత్యం, సాంస్కృతిక, మానవతా విలు వలుపై కార్యక్రమాలు నిర్వహించి వారిలో అనుభవాలను ప్రోదిచేయాలి. క్రీడల్లో భాగస్వాముల్ని చేయాలి విద్యార్థులను కేవలం బోధన, పుస్తక పఠనాలకే పరిమితం చేయకుండా క్రీడల్లో భాగస్వాముల్ని చేయాలి. ప్రతిరోజూ సాయంత్రం లేదా స్థానిక వాతావరణానికి వీలుగా అనువైన సమయాల్లో వీటిని చేపట్టాలి. ప్రతీ విద్యార్థి ఏదో ఒక క్రీడాంశంలో పాల్గొనేలా చేయాలి. ఆ తరువాత దానిలో నైపుణం సాధించేలా తీర్చిదిద్దాలి. మెంటరింగ్.. కనెక్టింగ్ ఈ కొత్త విధానంలో విద్యార్థులకు ఫ్యాకల్టీ సభ్యులతో అనుసంధానించడం (మెంటర్షిప్) అతిముఖ్యమైనది. ఇది విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఆరోగ్యకరమైన బంధాన్ని నెలకొల్పుతుంది. దీనివల్ల విద్యార్థులు కొత్త అనుభవాలతో మరింత వికాసాన్ని పొందడంతో పాటు అభ్యసనంలో మరింత ఉత్సాహాన్ని పొందగలుగుతారు. మెంటర్షిప్ వల్ల ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా ముందుకు వెళ్లగలిగే స్వభావాన్ని అలవర్చుకుంటారు. కుల మతాలకు అతీతంగా ఒక దేశ పౌరుడిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలపై విద్యార్థి ఆలోచించేలా చేయాలి. ఈ మెంటరింగ్‌లో.. అంశాలను ఎంచుకోవడం, ఏం చేయాలో.. ఏం చేయరాదో అన్నవాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం మెంటర్ల ప్రధాన బాధ్యత. వివిధ అంశాలపై ఆరు రోజుల పాటు మెంటర్షిప్ కొనసాగించాలి. ప్రతీ మెంటార్ పరిధిలో 20 మంది చొప్పున గ్రూప్‌ను ఏర్పాటుచేయాలి. విద్యార్థులు తమ జీవితంపట్ల, సమాజంలో తాను పోషించాల్సిన పాత్రపట్ల స్పష్టమైన అవగాహనకు వచ్చేలా చూడాలి. అంతేకాక.. విద్యార్థులు వేరు, విద్యా సంస్థ వేరు అనేలా కాకుండా మొత్తం ఒక కుటుంబం మాదిరిగా ఉండేలా విద్యా సంబంధిత కార్యక్రమాలు, సదస్సులు, ప్రయోగశాలలు, తదితర కార్యక్రమాలు పెంపొందించాలి. అలాగే, వీటి ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలి. సెమిస్టర్ పూర్తయిన అనంతరం ప్రతీవారం ఓ గంటసేపు ప్రతీ మెంటర్ గ్రూపు సమావేశమవ్వాలి. -
వెరీగుడ్ తెలంగాణ!
మానవ వనరుల శాఖ అభినందనలు సాక్షి, హైదరాబాద్: కేంద్రం విధించిన నిర్ణీత గడువు (ఆగస్టు 15)కు ముందే ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాలను పూర్తి చేసి రాష్ట్రం భేష్ అనిపించుకుంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమీక్షలో తెలంగాణ విద్యాశాఖకు ప్రశంసలు తెలియజేసింది. గడిచిన మూడు నెలల్లో 14,526 మరుగుదొడ్లను నిర్మించి రాష్ట్రం రికార్డు సృష్టించింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మిస్తున్న మరో 267 టాయిలెట్లు రెండు మూడు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో 3,079 పాఠశాలల్లో చేపట్టిన బోర్లు వేయడం, పైపులైన్ల నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. మొత్తంగా 36,224 మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టగా శుక్రవారం నాటికి 35,957 వినియోగంలోకి తెచ్చింది. ఏపీలో ఇంకా 10,363 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీంతో కేంద్రం ఏపీ చేపట్టిన చర్యలపై కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.