స్టూడెంటే నం.1 | Huge changes in higher education | Sakshi
Sakshi News home page

స్టూడెంటే నం.1

Published Tue, Sep 4 2018 1:14 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Huge changes in higher education - Sakshi

సాక్షి, అమరావతి : దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో బోధనాభ్యాసన ప్రక్రియల్లో సమూల మార్పులకు కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయించింది. పాత మూస ధోరణులను వదిలి అధునాతన ప్రణాళికలు, బోధనా విధానాలు అనుసరించేలా కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులకు సంబంధించి వర్సిటీలతో పాటు అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో వీటిని పాటించాల్సిందిగా సూచించింది. ఆయా సంస్థల్లో ఇకపై విద్యార్థి కేంద్ర బిందువుగా పాఠ్య ప్రణాళిక, బోధనాభ్యాసన విధానాలను అమలుచేయాల్సి ఉంటుంది. ‘స్టూడెంట్‌ ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌’ పేరిట ఈ మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌ (యూజీసీ) విడుదల చేసింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలుచేసేలా ఉన్నత విద్యాసం స్థలన్నీ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విద్యార్థులను నూతన ఆలోచనల దిశగా ముందుకు తీసుకువెళ్లడం.. సామాజిక అంశాలపై సునిశితం గా స్పందించడం.. నైతిక విలువలను పెంపొం దించుకోవడం.. బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఇందులోని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు.

కొత్తవిధానంలో ప్రధానాంశాలు..
ప్రస్తుతం నాలుగు గోడల మధ్య పుస్తకాల ఆధారంగా సాగే బోధనకు బదులు  సామాజికీకరణ, అనుసంధానత, పాలనా భాగ స్వామ్యం, అనుభవీకరణ అనేవి ఈ  విధానంలో ప్రధానాంశాలుగా పొందుపరిచారు. 
- కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులు సౌకర్యవంతంగా తమ చదువు కొనసాగిం చేందుకు సీనియర్‌ విద్యార్థులు, అధ్యాప కులతో మార్గనిర్దేశం చేస్తారు. దీనివల్ల విద్యా ర్థులు ఉత్సాహపూరిత వాతావరణంలో చదువుకునేందుకు వీలుంటుంది. 
- ముందుగా సంస్థలోని విద్యార్థులు, అధ్యాప కుల మధ్య అనుబంధం ఏర్పడేలాచేయాలి. 
- సంస్థ విధానాలు, కార్యక్రమాలు, విలువలు, మెంటార్‌ గ్రూపులపై ముందుగా వారికి అవ గాహన కల్పించాలి. 
- నిపుణులతో ఉపన్యాసాలు ఇప్పించాలి. ఆయా విద్యా సంస్థల పరిధిలోని స్థానిక అం శాలపై అవగాహన కలిగేలా విద్యార్థులతో పర్యటనలు చేయించాలి. 
- గ్రూపు చర్చలు, సబ్జెక్టు అంశాలపై ప్రసంగాలు, అభ్యసన నైపుణ్యాలు, కళలు, సాహిత్యం, సాంస్కృతిక, మానవతా విలు వలుపై కార్యక్రమాలు నిర్వహించి వారిలో అనుభవాలను ప్రోదిచేయాలి. 

క్రీడల్లో భాగస్వాముల్ని చేయాలి
విద్యార్థులను కేవలం బోధన, పుస్తక పఠనాలకే పరిమితం చేయకుండా క్రీడల్లో భాగస్వాముల్ని చేయాలి. ప్రతిరోజూ సాయంత్రం లేదా స్థానిక వాతావరణానికి వీలుగా అనువైన సమయాల్లో వీటిని చేపట్టాలి. ప్రతీ విద్యార్థి ఏదో ఒక క్రీడాంశంలో పాల్గొనేలా చేయాలి. ఆ తరువాత దానిలో నైపుణం సాధించేలా తీర్చిదిద్దాలి. 

మెంటరింగ్‌.. కనెక్టింగ్‌
ఈ కొత్త విధానంలో విద్యార్థులకు ఫ్యాకల్టీ సభ్యులతో అనుసంధానించడం (మెంటర్‌షిప్‌) అతిముఖ్యమైనది. ఇది విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఆరోగ్యకరమైన బంధాన్ని నెలకొల్పుతుంది. దీనివల్ల విద్యార్థులు కొత్త అనుభవాలతో మరింత వికాసాన్ని పొందడంతో పాటు అభ్యసనంలో మరింత ఉత్సాహాన్ని పొందగలుగుతారు. మెంటర్‌షిప్‌ వల్ల ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా ముందుకు వెళ్లగలిగే స్వభావాన్ని అలవర్చుకుంటారు. కుల మతాలకు అతీతంగా ఒక దేశ పౌరుడిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలపై విద్యార్థి ఆలోచించేలా చేయాలి. ఈ మెంటరింగ్‌లో.. అంశాలను ఎంచుకోవడం, ఏం చేయాలో.. ఏం చేయరాదో అన్నవాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం మెంటర్ల ప్రధాన బాధ్యత.

వివిధ అంశాలపై ఆరు రోజుల పాటు మెంటర్‌షిప్‌ కొనసాగించాలి. ప్రతీ మెంటార్‌ పరిధిలో 20 మంది చొప్పున గ్రూప్‌ను ఏర్పాటుచేయాలి. విద్యార్థులు తమ జీవితంపట్ల, సమాజంలో తాను పోషించాల్సిన పాత్రపట్ల స్పష్టమైన అవగాహనకు వచ్చేలా చూడాలి. అంతేకాక.. విద్యార్థులు వేరు, విద్యా సంస్థ వేరు అనేలా కాకుండా మొత్తం ఒక కుటుంబం మాదిరిగా ఉండేలా విద్యా సంబంధిత కార్యక్రమాలు, సదస్సులు, ప్రయోగశాలలు, తదితర కార్యక్రమాలు పెంపొందించాలి. అలాగే, వీటి ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలి. సెమిస్టర్‌ పూర్తయిన అనంతరం ప్రతీవారం ఓ గంటసేపు ప్రతీ మెంటర్‌ గ్రూపు సమావేశమవ్వాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement