సింధు, గోపీలను నేనలా అనలేదు | Deputy CM Mahmood Ali clarifies on speculations | Sakshi
Sakshi News home page

సింధు, గోపీలను నేనలా అనలేదు

Published Fri, Aug 26 2016 9:58 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

సింధు, గోపీలను నేనలా అనలేదు

సింధు, గోపీలను నేనలా అనలేదు

హైదరాబాద్: 'సింధు- గోపీచంద్ లపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు' అంటూ కొద్ది రోజులుగా ప్రచారం అవుతోన్న వార్తలపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఎంతగానో అభిమానించే మీడియానే తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో భారత్ కు రజత పతకాన్ని సాధించిపెట్టిన సింధు దేశానికి గర్వకారణమని, అటు వంటి సింధును తయారుచేసిన కోచ్ పుల్లెల గోపీచంద్ గర్వించదగిన వ్యక్తి అని ఆయన అన్నారు.

శుక్రవారం బషీర్ బాగ్ లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను మాట్లాడినట్లుగా మీడియాలో ప్రసారం అవుతోన్న వార్తలను ఆయన ఖండించారు. రియో నుంచి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సింధు- గోపీచంద్ లకు అద్భుత స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లిద్దరినీ గచ్చిబౌలి స్టేడియంలో సన్మానించింది. ఆ సందర్భంగా.. 'ఎంత ఖర్చయినాసరే, సింధూకు విదేశీ కోచ్ ను నియమించి మరింత ప్రోత్సహిస్తాం'అని డిప్యూటీ సీఎం అన్నట్లు వార్తలు వినవచ్చాయి. అయితే నిజానికి తాను అలా అనలేదని, గోపీచంద్ మరో అకాడమీని స్థాపించే ఆలోచనలో ఉంటే గనుక సహకరిస్తామని మాత్రమే అన్నట్లు మహమూద్ అలీ వివరణ ఇచ్చారు.

'నీటి ఒప్పందాల కోసం ఇటీవల ముంబై వెళ్లినప్పుడు కూడా అక్కడి మీడియా ఇదే విషయంపై నన్ను పదే పదే ప్రశ్నించడం నన్ను బాధ పెట్టింది. అప్పుడు సీఎం కేసీఆర్ నా పక్కనే ఉన్నారు. వార్తలు రాసేటప్పుడు సరైన ఆధారాలతో రాస్తే సమాజానికి మేలు కలుగుతుందని కేసీఆర్ చురకలు వేయడంతో విలేకరులు వెనక్కి తగ్గారు'అని మహమూద్ అలీ చెప్పారు. సింధుకుగానీ, గోపించద్‌కుగానీ అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అలీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement