
పాక్‌కు షాకిస్తూ అమెరికా సభ్యుల బిల్లు!
అమెరికా చట్టసభకు చెందిన ఇద్దరు శక్తిమంతమైన సభ్యులు పాకిస్థాన్‌కు షాకిచ్చేలా ఓ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం(స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం) గా పాకిస్థాన్‌ని ప్రకటించాలని వారు బిల్లులో కోరారు.
’పాకిస్థాన్ పాల్పడిన వెన్నుపోట్లకుగాను.. మనం ఆ దేశానికిచ్చే నిధులను ఆపివేసి.. దానిని ఉగ్రవాద ప్రాయోజిత రాజ్యంగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ (చట్టసభ) సభ్యుడు, ఉగ్రవాదంపై సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పోయి ఈ బిల్లులో పేర్కొన్నారు. ఆయన డెమొక్రిటిక్ పార్టీ చట్టసభ సభ్యుడు డెనా రోహ్రాబచర్‌తో కలిసి ’ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్తాన్‌ను గుర్తించే చట్టం’ బిల్లును ప్రవేశపెట్టారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ కమిటీలో కీలక సభ్యుడిగా డెనా రోహ్రాబచర్ ఉన్నారు.
’పాకిస్థాన్ ఒక విశ్వసించలేని మిత్రదేశమే కాదు.. అది ఎన్నో ఏళ్లుగా మన శత్రువుల్ని రెచ్చగొడుతూ వస్తున్నది. ఒసాన్ బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించడం మొదలు.. హక్కానీ నెట్‌వర్క్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం వరకు ఉగ్రవాదంపై యుద్ధంలో పాకిస్థాన్‌కు ఎవరికి అండగా నిలిచిందో చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అది అమెరికాకు ఎప్పుడు అండగా నిలబడలేదు’ అని పోయి వివరించారు. ఒబామా సర్కారు తమ బిల్లుపై అధికారికంగా సమాధానం ఇవ్వాల్సి ఉందని ఆయన కోరారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఇచ్చిందా? లేదా? అన్న దానిపై 90 రోజుల్లో అధ్యక్షుడు నివేదిక విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.