
దేవాదుల గేట్ వాల్వ్ లీక్
ధర్మసాగర్(వరంగల్ జిల్లా): వరంగల్ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి గండిరామారంనకు నీటిని పంపింగ్ చేసే దేవాదుల పైప్‌లైన్ గేట్‌వాల్వ్ మండలంలోని జానికిపురం వద్ద బుధవారం లీక్ అయింది. నీరు ఒక్కసారిగా పైకిఎగిసిపడుతూ పంటపొలాల నుంచి వెళ్తూ సమీపంలోని బతుకమ్మకుంటలోకి చేరుతున్నాయి.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు గేట్‌వాల్వ్ లీకేజీతో అయినా తమ ఊరికుంట నిండుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీని అరికట్టేందుకు అక్కడికి చేరుకున్న దేవాదుల అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమిలేక వారు వెనుదిరిగారు. మోటార్లు హాఫ్‌చేసి గేట్‌వాల్వ్ లీకేజీని అరికడుతామని అధికారులు వెల్లడించారు.